రిపబ్లిక్ మూవీ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: రిపబ్లిక్
నటీనటులు: సాయి ధరమ్ తేజ్, రమ్యకృష్ణ, జగపతి బాబు, ఐశ్వర్యా రాజేష్ తదితరులు
సంగీతం: మణిశర్మ
సినిమాటోగ్రఫీ: ఎం.సుకుమార్
నిర్మాతలు: జె.భగవాన్, జె.పుల్లారావు
దర్శకత్వం: దేవా కట్టా

సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘రిపబ్లిక్’ నేడు ప్రపంచవ్యాప్తంగా మంచి అంచనాల నడుమ రిలీజ్ అయ్యింది. ఈ సినిమాను దర్శకుడు దేవా కట్టా తెరకెక్కించడంతో ఈ సినిమా ఎలాంటి కథతో వస్తుందా అనే ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఈ సినిమా టీజర్, ట్రైలర్లలో ఈ సినిమా పూర్తి పొలిటికల్ ఎంటర్‌టైనర్‌గా వస్తున్నట్లు చిత్ర యూనిట్ చూపించారు. రమ్యకృష్ణ ఓ పవర్‌ఫుల్ పాత్రలో నటిస్తున్న రిపబ్లిక్ చిత్రం దేవా కట్టాతో పాటు సాయి ధరమ్ తేజ్‌కు ఎలాంటి విజయాన్ని అందించిందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
పంజా అభిరామ్ అలియాస్ అభి(సాయి ధరమ్ తేజ్) తండ్రి(జగపతి బాబు) ఓ ప్రభుత్వాధికారి. అయితే ఒక అంశంలో జగపతిబాబు చేసిన పని అభికి ఏమాత్రం నచ్చదు. దీంతో అభి ఐఏఎస్ అవ్వాలని గట్టిగా ప్రయత్నించి అనుకున్నట్లుగానే ఐఏఎస్ అవుతాడు. ఈ సినిమాలో నెగెటివ్ షేడ్స్ ఉన్న ఓ రూలింగ్ పార్టీ లీడర్ విశాఖ వాణి(రమ్యకృష్ణ) కనిపిస్తుంది. ఎన్నికల్లో రిగ్గింగ్ చేస్తూ గెలిచే విశాఖ వాణితో వార్ ప్రకటిస్తాడు అభి. ఈ క్రమంలో అభికి విశాఖ వాణికి మధ్య జరిగే యుద్ధంలో ఎవరు గెలుస్తారు? అసలు విశాఖ వాణిని అభి ఎందుకు టార్గెట్ చేస్తాడు? చివరకు ఏమవుతుంది? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
దర్శకుడు దేవా కట్టా ‘ప్రస్థానం’ తరువాత మరోసారి అలాంటి పవర్‌ఫుల్ నేపథ్యంలో సాగే పొలిటికల్ కంటెంట్‌తో మనముందుకు వచ్చాడని చెప్పాలి. అవినీతిగా గెలిచే ఓ రాజకీయ నాయకురాలితో ఓ సిన్సియర్ ఐఏఎస్ ఎలా ఢీకొన్నాడు అనే కథను చాలా చక్కగా ప్రెజెంట్ చేశాడు ఈ డైరెక్టర్. ఇక ఈ సినిమా కథనం విషయానికి వస్తే, తన తండ్రి ఓ అవినీతి అధికారిగా తేలడంతో, తాను సిన్సియర్ ఐఏఎస్ కావాలని ప్రయత్నించి కష్టపడి ఐఏఎస్ అవుతాడు హీరో. ఈ క్రమంలో అతడికి పరిచయమైన మైరా(ఐశ్వర్యా రాజేష్) సోదరుడి మిస్సింగ్ కేసు అతడు డీల్ చేస్తాడు. ఈ క్రమంలో ఓ పవర్‌ఫుల్ లీడర్(రమ్యకృష్ణ) ఈ మిస్సింగ్ కేసులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటుంది. అయితే ఈ క్రమంలో అభికి కొన్ని షాకింగ్ నిజాలు తెలుస్తాయి. ఈ క్రమంలోనే ఆ లీడర్ రైట్ హ్యాండ్‌గా ఉండే ఓ వ్యక్తి చనిపోవడంతో ఆమె ఈ ఐఏఎస్ ఆఫీసర్‌తో వార్ డిక్లేర్ చేస్తుంది. ఇక్కడ ఓ అదిరిపోయే సీన్‌తో ఇంటర్వెల్ బ్యాంగ్ ఇచ్చాడు దర్శకుడు.

ఇక సెకండాఫ్‌పై ప్రేక్షకుల్లో అదిరిపోయే అంచనాలు క్రియేట్ చేసిన డైరెక్టర్ వాటికి తగ్గట్టుగానే కథను ముందుకు తీసుకెళ్లాడు. ఈ క్రమంలో మైరా గురించి ఓ అదిరిపోయే ట్విస్ట్‌ను మనకు చూపించారు. ఈ క్రమంలో మైరాను విశాఖ వాణి నుండి కాపాడేందుకు అభి పడే పాట్లు, విశాఖ వాణి అభిపై గెలిచేందుకు చేసే ప్లాన్‌లతో మనకు సెకండాఫ్‌ను చూపించారు చిత్ర యూనిట్. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్‌లో ఓ మంచి మెసేజ్‌తో కూడుకున్న ఎమోషనల్ సీన్స్‌తో సినిమాను ముగించాడు దర్శకుడు దేవా కట్టా. ఇలా పూర్తి పొలిటికల్ థ్రిల్లర్ అంశాలతో రిపబ్లిక్ చిత్రాన్ని ప్రేక్షకులు మెచ్చే చిత్రంగా తీర్చిదిద్దడంలో దేవా కట్టా తన ట్యాలెంట్‌ను మరోసారి నిరూపించుకున్నాడు. ఓవరాల్‌గా ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో సక్సె్స్ అయ్యిందని చెప్పొచ్చు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఈ సినిమాలో అభి పాత్రలో సాయి ధరమ్ తేజ్ చాలా మెచ్యూరిటీ ఉన్న పర్ఫార్మెన్స్ చూపించాడు. ఐఏఎస్ అధికారిగా తేజ్ నటన ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ఎమోషనల్ సీన్స్, యాక్షన్ సీన్స్‌లో తేజ్ ప్రేక్షకులను మరోసారి ఇంప్రెస్ చేశాడు. అటు నెగెటివ్ షేడ్స్ ఉన్న రాజకీయ నేతగా రమ్యకృష్ణ పాత్ర ఈ సినిమాకే హైలైట్ అని చెప్పాలి. నరసింహ చిత్రంలో నీలాంబరి తరహా పర్ఫార్మెన్స్‌ను రమ్యకృష్ణ ఈ సినిమాలో మరోసారి మనకు చూపించారు. ఇక జగపతి బాబు పాత్ర కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. అటు హీరోయిన్ ఐశ్వర్యా రాజేష్ పాత్ర సినిమా కథనంలో బాగా ఉపయోగపడింది. మిగతా నటీనటులు తమ పాత్రల మేర పర్వాలేదనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు దేవా కట్టా పొలిటికల్ కంటెంట్ ఉన్న సినిమాలను ఎలా హ్యాండిల్ చేస్తాడో మరోసారి ఈ సినిమాతో ప్రూవ్ చేసుకున్నాడు. గతంలో ఆయన ప్రస్థానం చిత్రంతో ఎలాంటి సక్సెస్ అందుకున్నాడో మనం చూశాం. ఇప్పుడు మరోసారి అలాంటి సబ్జెక్ట్‌ను ఎంచుకున్నా, దాన్ని ఎలివేట్ చేయడంలో అక్కడక్కడ ట్రాక్ తప్పాడు ఈ డైరెక్టర్. ఇక సినిమా మెయిన్ పాయింట్ బాగున్నా, అది రొటీన్‌గా అనిపించడంతో ప్రేక్షకులు కాస్త బోరింగ్‌గా ఫీలవుతారు. అటు సినిమాకు మణిశర్మ సంగీతం పెద్దగా బలాన్ని అందించలేకపోయింది. ముఖ్యంగా ఈ సినిమా పాటలు సోసోగా ఉండటం, బీజీఎం కూడా ఆయన స్థాయిలో లేదనిపించింది. సినిమాటోగ్రఫీ పనితనం బాగుంది. ఎడిటింగ్ పనులు, నిర్మాణ విలువలను పర్వాలేదు.

చివరగా:
రిపబ్లిక్ – కొంతమందిని మాత్రమే ఆకట్టుకుంది!

రేటింగ్:
2.5/5.0