డైలాగులు రీల్ లైఫ్ లోనే.. పేరుకు సినిమా పెద్దలు!

మన సినిమా హీరోలున్నారే.. సినిమాల్లో అద్భుతమైన డైలాగులు చెబుతారు.. వావ్ .. అనిపించేలా మాట్లాడతారు.. ప్రేక్షకుల చేత చప్పట్లు కొట్టించుకుంటారు.. మరి నిజజీవితంలో.. బిల్ కుల్ సైలెంట్.. ఎక్కడ ఏం జరిగినా మనకేంటి అన్నట్లుంటారు.. మనకెందుకులే అనేది వాళ్ల ఫీలింగ్.. సమస్య ఎవరిదైనా సినిమా.. పక్కింటివాడిదైనా.. తన సినిమా నిర్మాతదైనా.. ఏ సమస్య వచ్చినా మేము జడపదార్థాలే అనేది మరోసారి నిరూపించారు.. ఏ విషయంలో అంటే.. సినిమా టికెట్ల విషయంలో జగర్ సర్కార్ తీసుకున్న నిర్ణయంపై ఎవరూ స్పందించకపోవడమే ఇందుకు నిదర్శనం.

ఏపీలో సినిమా టికెట్లను ప్రభుత్వమే విక్రయిస్తుంది.. దానికి ప్రత్యేక వెబ్ సైట్ రూపొందించి సినిమాటోగ్రఫీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఈ వ్యవహారం నడుస్తుంది.. ఆ తరువాత టాక్స్ తదితరాలు తీసుకొని మిగతా డబ్బు థియేటర్ యాజమాన్యాలకు ఇస్తామనేది సర్కారు కాన్సెప్ట్.. జగన్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంపై మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.. సోషల్ మీడియాలో చర్చ కూడా జరిగింది.. రైల్వే టికెట్ల లాగ సినిమా టికెట్లు ప్రభుత్వం అమ్మడమేంటి అని కూడా పలువురు ప్రశ్నించారు. అయితే…ఈ ఇష్యూపై ఎవరు స్పందించినా సినిమా పెద్దలు మాత్రం నోరు మెదపడం లేదు.

పేరుకు సినిమా పెద్దలు..

సినిమా వాళ్లకు ఏ సమస్య వచ్చినా మేమే ముందుంటాం అని సినిమా పరిశ్రమలో పెద్దలుగా చెప్పుకునే వాళ్లు చాలా మంది ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో గొడవలు జరుగుతున్నాయి.. పరిశ్రమ పరువు పోతుంది అని బాధపడ్డ వాళ్లూ ఉన్నారు.. గతంలో ఏపీ సీఎం జగన్ తో భేటీ అయినా సినిమా పెద్ద తలలూ ఉన్నాయి.. అయితే.. ప్రభుత్వమే టికెట్లు అమ్మే నిర్ణయంపై మాత్రం అందరూ ష్.. గప్ చుప్ అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఏం మాట్లాడితే ఏం సమస్య వస్తుందో అనేది వాళ్ల బాధ. సర్కారు తీసుకున్న నిర్ణయంపై పాజిటివ్ గా మాట్లాడితే పరిశ్రమకు కోపం.. నెగిటివ్ గా మాట్లాడితే ప్రభుత్వానికి కోపం.. దీంతో ఏం చేయాలో అర్థం కాక.. తమ ఇతర వ్యాపారాలపై ఈ ప్రభావం పడకుండా తెలివిగా వ్యవహరిస్తున్నారు మన సినిమా వాళ్లు. కనీసం నిర్మాతలు కూడా నోరెత్తడం లేదు. సినిమాల్లో ఉంటూ జనం కోసం రాజకీయాల్లోకి వచ్చిన పవన్ కల్యాణ్ కూడా ఏమీ అనడం లేదు. కోట్ల రూపాయలు రెమ్యునరేషన్ తీసుకునే పవర్ స్టార్ కూడా ఇలా సైలెంట్ కావడమేంటి అని పరిశ్రమలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చివరికి సర్కారు చెప్పినట్లే జరుగుతుందని అర్థమవుతోంది.