డబ్బులు పడ్డాయ్ సరే.. డ్రా చేయడం ఎలా?

నాలుగైదు రోజులుగా తమ అకౌంట్లలో దళిత బంధు డబ్బు పడటంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఆ డబ్బు డ్రా చేసుకునేందుకు బ్యాంకుకు వెళితే వారికి నిరాశే ఎదురవుతోంది. డబ్బు తీసుకునేందుకు అవకాశం లేకుండా అకౌంట్ ఫ్రీజ్ లో ఉందని బ్యాంకు సిబ్బంది చెప్పడంతో షాక్ కు గురికావడం వారి వంతైంది. డబ్బు వచ్చింది కదా అని డ్రా చేసుకునేందుకు లేదని.. ఏదైనా వ్యాపారం ప్రారంభించడానికి దానిని వాడుకోవాలని బ్యాంకర్లు చెబుతున్నారు.

పథకం ప్రకటించిన ఇన్ని రోజుల తరువాత డబ్బు జమ

తెలంగాణ సీఎం కేసీఆర్ దళితబంధు పథకాన్ని ముందుగా తాను దత్తత తీసుకున్న గ్రామం వాసాలమర్రి (యాదాద్రి భువనగిరి జిల్లా)లో ప్రకటించారు. అక్కడి 76 దళిత కుటుంబాలకు రూ. 7.60 కోట్లు మంజూరు చేశారు. ఆ తరువాత హుజూరాబాద్ లో ఆగస్టు 16న ప్రారంభించిన సీఎం 20వేల కుటుంబాలకు 2వేల కోట్ల రూపాయలు ఇస్తున్నట్లు ప్రకటించారు. అయితే సెప్టంబర్ మొదటి వారం వరకు లబ్ధిదారుల అకౌంట్లలో డబ్బు జమ కాలేదు. సీఎం నిధులు మంజూరు చేసినా ఆ మొత్తం మాత్రం కలెక్టర్ల చేతుల్లో ఉండిపోయింది. దీంతో దళితుల నుంచి ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. పథకం ప్రకటించి.. డబ్బు విడుదల చేసిన తరువాత మాకు ఇవ్వకపోతే ఎలా అని ప్రశ్నించారు. సమస్య పెద్దదవుతుందని భావించిన సీఎం ఆ నిధులు లబ్ధిదారుల అకౌంట్లలో జమ చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే గత నాలుగైదు రోజులుగా రూ. 10 లక్షలు వచ్చినట్లు తమ మొబైల్స్ కు మెసేజులు వస్తుండటంతో లబ్దిదారులు హర్షం వ్యక్తం చేశారు.

తీరా బ్యాంకుకు వెళితే..

డబ్బు వచ్చింది కదా.. తీసుకుందామని బ్యాంకుకు వెళ్లిన వారికి నిరాశే ఎదురైంది. ఊరికే డ్రా చేసుకునేందుకు లేదు.. వ్యాపారం కోసమే దీనిని వాడాలని బ్యాంకర్లు చెప్పారు. మేము ట్రాక్టర్ కొనుగోలు చేస్తాం, క్యాబ్ కొంటాం అని చాలా మంది చెప్పారు. అందరూ ఇలా ట్రాక్టర్, కారు కొంటే.. బిజినెస్ ఏం నడుస్తుందని బ్యాంకు సిబ్బంది కూడా నో చెప్పేశారు. సరైన బిజినెస్ చేస్తామని వస్తే.. బ్యాంకర్ శాటిస్ ఫై అయితే.. అప్పుడు డబ్బు చేతిలోకి వస్తుందని వారికి అర్థమైంది. దీంతో చేసేది లేక వెనుతిరిగారు.