దళిత బంధు .. బడ్జెట్ ఎట్ల అడ్జస్ట్ చేద్దామంటావ్..?

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి, గులాబీ పార్టీ అధినేత కె.చంద్రశేఖర్ రావు జులైలో ఉన్నట్టుండి దళిత బంధు పథకాన్ని ప్రకటించారు. దళిత కుటుంబానికి రూ. 10 లక్షల నగదు అందజేస్తున్నట్లు ప్రకటించారు. మాజీ మంత్రి ఈటల రాజేందర్ టీఆర్ఎస్ పార్టీని వీడిన తరువాత, హుజూరాబాద్ లో ఉప ఎన్నికలు వస్తాయని భావిస్తున్న తరుణంలో కేసీఆర్ దళితబంధు ప్రకటించారని అందరికీ తెలిసిందే. హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈ పథకాన్ని పైలెట్ ప్రాజెక్టుగా ప్రకటించి అమలు చేస్తామని పలుసార్లు కేసీఆర్ చెప్పారు. ఈ తరువాత రాష్ట్రంలోని 118 నియోజకవర్గాల్లో దళితబంధు ఇస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో ఉన్న 17 లక్షల కుటుంబాలకు రూ. 1.70 లక్షల కోట్లు ఇస్తామని చెప్పారు. అయితే ఇపుడు ఈ పథకం ప్రభుత్వ మెడకు చుట్టుకుంటున్నట్లు సమాచారం.

పథకం ప్రకటించిన అనంతరం కేసీఆర్ బడ్జెట్ గురించి ఆలోచిస్తున్నారట. కనీసం హుజూరాబాద్ నియోజకవర్గంలో ఉన్న 23వేల దళితబంధు కుటుంబాలకు రూ. పది లక్షల చొప్పున నగదు పంచేందుకు ఫండ్స్ ప్రభుత్వం వద్ద లేవని సమాచారం. నగదు పంపిణీ ఆలస్యం అవుతుండటం వల్లే సర్వే పేరిట కాలయాపన చేస్తున్నట్లు తెలిసింది. హుజూరాబాద్ ల్ అధికారులు మాత్రం సర్వే చేయడం ప్రారంభించారు. సెప్టెంబరు 2 వరకు ఈ సర్వే కొనసాగుతుంది. మీకు పొలం ఉందా, సొంత ఇల్లు ఉందా, కారు, ప్రభుత్వ ఉద్యోగం లాంటివి ఉన్నాయా అని ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగమున్నా సరే.. ఆ కుటుంబానికి దళితబంధు అమలు చేస్తామని గులాబీ బాస్ ఘంటాపథంగా చెప్పారు. మరి ఇన్ని చెప్పిన తరువాత సర్వే ఎందుకు చేస్తున్నట్లో అని సొంత పార్టీ నాయకులే లోలోపల ప్రశ్నిస్తున్నారు.