అనుకున్నదొకటి.. అయినదొకటి.. బోల్తాపడ్డావులే నాయకా..

ఈటల ఎపిసోడ్ తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతోంది.. ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించడం.. ఆ తరువాత ఈటల పార్టీకి రాజీనామా చేయడం.. బీజేపీ కప్పుకోవడం చకచకా జరిగిపోయాయి. అంతేనా.. ఈటల రాజీనామాతో హుజూరాబాద్ లో ఎన్నికలు నేడో..రేపో వచ్చేస్తాయన్నట్లు టీఆర్ఎస్ అధినేత భావించారు. అందుకే దళితబంధు పథకం ప్రారంభించి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఈటల కూడా తానేం తక్కువ కాదన్నట్లు.. నేను రాజీనామా చేసినందుకే దళితబంధు వచ్చింది..అంటూ ఆ క్రెడిట్ తనకు దక్కేలా మాట్లాడుతున్నారు. ఇరు పార్టీల నాయకులు పోటాపోటీగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు.

అయితే.. కేంద్ర ఎన్నికల సంఘం చావు కబురు చల్లగా పంపింది. దానిని చూసిన కారు పార్టీ నాయకులకు నోట మాట రావడం లేదు. ఐదు రాష్ట్రాలకు ఎన్నికలు జరపాలి.. అలాగే ఉప ఎన్నికలు కూడా నిర్వహించాలి.. మీమీ అభిప్రాయాలు చెప్పండి.. అదీ ఆగస్టు 31లోపు చెప్పండి అని లేఖలు పంపింది. అంటే పరోక్షంగా ఈనెలలో హుజూరాబాద్ బైపోల్స్ లేనట్లే కదా.. అని టీఆర్ఎస్ పార్టీ పెద్దలు అనుకుంటున్నారు. పోనీ.. ఆగస్టు తరువాత వెంటనే ఉంటాయా అంటే.. అదీ ఉండదు. ఎందుకంటే ఈనెల 31 వరకు వచ్చిన అభిప్రాయాలను చూసి.. క్రోడీకరించి.. సమీక్షించి.. ఆ తరువాత తేదీ నిర్ణయిస్తారు. దీనికి ఎంత తక్కువ సమయం అనుకున్నా.. కనీసం రెండు వారాలు పడుతుంది.. అనంతరం ఎన్నికల డేట్ ప్రకటన ఓ రోజు.. నోటిఫికేషన్ ఓరోజు ఉంటుంది. అంటే సెప్టెంబరు చివరి నాటికి ఎన్నికలు జరగే అవకాశముండవచ్చు. ఈసీ గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తేనే సెప్టెంబరులో ఎలక్షన్స్ జరుతాయి.. చూద్దాం.. చేద్దాం అని నిదానంగా నిర్ణయం తీసుకుంటే మాత్రం ఆలస్యం అయి తీరుతుంది. అందుకే ఓ సామెత గుర్తుకొస్తుంది.. ఆలూ చూలూ లేదు.. కొడుకు పేరు సోమలింగం అని.