కుక్క‌ కోసం కాంస్య విగ్ర‌హం.. ఎక్కడంటే..?

ఎంతో ఇష్టంగా చూసుకుంటున్న ఓ వస్తువు పోతేనే మనసు విలవిల్లాడుతోంది. అలాంటిది తొమ్మిదేళ్ల పాటు ఎంతో ప్రేమగా పెంచుకున్న ఓ కుక్క చనిపోతే ఆ బాధ ఇంకా ఎక్కువగా ఉంటుంది. అయితే ఓ పెంపుడు కుక్క మీద ఉన్న ప్రేమను ఓ రైతు విభిన్నంగా చూపించాడు. శునకానికి ఏకంగా కాంస్య విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయించాడు. వివరాల్లోకి వెళితే. కృష్ణా జిల్లా బాపుల‌పాడు మండ‌లం అంకాపూర్ గ్రామానికి చెందిన సుంక‌ర జ్ఞాప‌క‌రావు అనే రైతు ఓ కుక్కను తొమ్మిదేళ్లుగా పెంచుకున్నాడు.

దానికి ప్రేమగా పెంచుకుంటూ అంజి అని పేరు పెట్టుకున్నాడు. కానీ ఐదేళ్ల క్రితం ఆ కుక్క ప్రమాదవశాత్తు చనిపోయింది. తన పిల్లలో ఒకరిగా చూసుకుంటున్న ఆ కుక్క చనిపోవడంతో ఆ రైతు చాలా బాధపడ్డాడు. మనుషులకు చేసినట్టే కుక్క‌కు కూడా అంత్య‌క్రియ‌లు నిర్వ‌హించి తన అభిమానాన్ని చాటుకున్నాడు. ఇక ప్ర‌తి ఏడాది ఆ శున‌కం వ‌ర్ధంతి నిర్వహిస్తూ ఊరంతా భోజ‌నాలు పెడుతున్నాడు. అయితే ఈ ఏడాది మాత్రం కుక్క కాంస్య విగ్ర‌హం ఏర్పాటు చేయించి.. విగ్రహావిష్కరణ చేసి శాస్త్రోక్తంగా పూజలు కూడా జరిపించాడు. ఈ సంద‌ర్భంగా గ్రామ‌స్తుల‌కు స్వీట్లు పంచిపెట్టాడు. ఈ రకంగా ఆ కుక్కపై తనకున్న ప్రేమను చాటుకున్నాడు.