కృష్ణపట్నానికి ఐసీఎంఆర్‌ టీమ్..నివేదికపై పెరుగుతున్న ఉత్కంఠ‌!

క‌రోనా క‌ల్లోలం సృష్టిస్తున్న వేళ‌.. నెల్లూరు జిల్లాలో కృష్ణపట్నంలో ఆనందయ్య తయారుచేస్తున్న ఆయుర్వేద మందుపైనే అంద‌రి చూపు ప‌డింది. దేశ‌మంత‌టా ఈ మందు గురించే చర్చించుకుంటున్నారు. కరోనాను నయం చేస్తుందని ప్ర‌చారం జ‌ర‌గ‌డంతో.. అంద‌రూ ఈ మందు కోసం ఎగ‌బ‌డ్డారు. అయితే ప్ర‌జ‌ల భ‌ద్ర‌త దృష్ట్యా ఈ మందు పంపిణీని నిలిపివేయాలని ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దీనిపై ఆయుష్ శాఖతో పాటు ఐసీఎంఆర్ అధ్యయనం చేస్తోంది. ఇప్ప‌టికే ఆయుష్ ప్రతినిధులు ఈ మందుపై పాజిటివ్‌గా స్పందించారు. ఇక నేడు ఆయుర్వేద మందును ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పరిశీలించనుంది. ఇందులో భాగంగా..ఐసీఎంఆర్ బృందం సోమవారం కృష్ణపట్నానికి రానుంది.

ఆయుర్వేద మందును ప‌రిశీలించిన అనంత‌రం ఐసీఎంఆర్ నివేదిక ఇవ్వ‌నుంది. నివేదిక‌లో మందు వల్ల ఎలాంటి సమస్యలూ లేవని చెబితే… మందును పంపిణీ చేసే అవకాశాలు ఉంటాయి. దీంతో ప్ర‌జ‌ల‌కు ఐసీఎంఆర్ నివేదికపై ఉత్కంఠ పెరిగిపోతోంది.