రాజు గారి గ‌ది 2 TJ రివ్యూ

టైటిల్‌: రాజు గారి గ‌ది 2

జాన‌ర్‌: హ‌ర్ర‌ర్ + కామెడీ జాన‌ర్‌

నటీనటులు: నాగార్జున , సమంత , సీరత్ కపూర్ , వెన్నెల కిషోర్ , శకలక శంకర్ , ప్రవీణ్

సినిమాటోగ్రఫీ: దివాకరన్

మ్యూజిక్: థ‌మ‌న్ ఎస్ఎస్‌

నిర్మాత: ప్రసాద్ వి. పొట్లూరి

దర్శకత్వం: ఓంకార్

రిలీజ్ డేట్‌: 13 అక్టోబ‌ర్‌, 2017

వైవిధ్యభరిత చిత్రాలను చేస్తూ తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకున్న సీనియర్‌ స్టార్‌ హీరో నాగార్జున తాజాగా నటించిన చిత్రం ‘రాజు గారి గది 2’. టాలీవుడ్‌లో యాంక‌ర్‌గా ప్ర‌స్థానం ప్రారంభించి రాజు గారి గ‌ది సినిమాతో ఒక్క‌సారిగా అంద‌రిదృష్టి త‌న‌వైపున‌కు తిప్పుకున్న ఓంకార్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ రాజు గారి గ‌ది 2 తెర‌కెక్కింది. తాజాగా మామాకోడళ్లుగా మారిన నాగార్జున‌, స‌మంత ప్ర‌త్యేక పాత్ర‌ల్లో న‌టించిన ఈ సినిమా ఈ రోజు ప్ర‌పంచ‌వ్యాప్తంగా రిలీజ్ అయ్యింది. హ‌ర్ర‌ర్‌, కామెడీ జాన‌ర్‌లో తెర‌కెక్కిన ఈ సినిమా రిలీజ్‌కు ముందు మంచి హైప్ తెచ్చుకోవ‌డంతో పాటు భారీగా ప్రి రిలీజ్ బిజినెస్ చేసింది. మ‌రి ఈ సినిమా ఎలా ఉందో TJ స‌మీక్ష‌లో చూద్దాం.

స్టోరీ:

బిజినెస్ ప‌ర్ప‌స్‌తో ముగ్గురు స్నేహితులు అయిన అశ్విన్‌, వెన్నెల‌కిషోర్‌, ప్ర‌వీణ్‌లు వైజాగ్‌లో రిసార్ట్ కొంటారు. ఓ రోజు అక్క‌డ‌కు సుహాసిని (శీర‌త్‌క‌పూర్‌) వస్తుంది. ఆమెపై కిశోర్, ప్రవీణ్ మనసుపడతారు. అయితే ఆమెకు దగ్గరయ్యే ప్రయత్నంలో వారికి ఆ రిసార్ట్ లో దెయ్యం ఉందని తెలుస్తుంది. దీంతో వారు భ‌యానికి గురై చ‌ర్చి ఫాద‌ర్ (సీనియ‌ర్ న‌రేష్‌)ను క‌లుస్తారు. ఆయ‌న‌కు కూడా అక్క‌డ ఆత్మ ఉంద‌న్న సందేహం వ‌స్తుంది. దీంతో ఆయ‌న ఫేమ‌స్ మెంట‌లిస్ట్ అయిన రుద్ర (నాగార్జున‌) సాయం కోర‌తాడు.

రిసార్ట్‌లోకి ఎంట‌ర్ అయిన రుద్ర‌కు అక్క‌డ ఆత్మ ఉంద‌ని అర్థ‌మ‌వుతుంది. ఆ రిసార్ట్‌లో అమృత (సమంత) అనే అమ్మాయి ఆత్మ తిరుగుతుందని, ఆ ఆత్మ కొన్ని ప్ర‌శ్న‌ల‌కు ఆన్స‌ర్లు తెలుసుకోవాల‌ని ట్రై చేస్తున్న‌ట్టు రుద్ర తెలుసుకుంటాడు. అస‌లు అమృత ఎవరు..? ఎలా చనిపోయింది..? అమృత తెలుసుకోవాలనుకుంటున్న సమాధానాలు ఏంటి..? ఆ సమాధానాలు అమృతకు తెలిసాయా..? రుద్ర ఆత్మకు ఎలా సాయం చేశాడు..? అన్నదే ఈ సినిమా స్టోరీ.

TJ విశ్లేష‌ణ :

నాగార్జున ఈ వ‌య‌స్సులో కూడా కుర్ర‌హీరోల‌కు పోటీ ఇస్తూ అద్భుతంగా న‌టించాడు. సినిమా అంతా ప్ర‌ధానంగా సమంత‌, నాగార్జున పాత్ర‌ల చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. వీరిద్దరి మ‌ధ్య వ‌చ్చే స‌న్నివేశాల‌ను ఓంకార్ బాగా డీల్ చేశాడు. ప్ర‌యోగాల‌కు ఎప్పుడూ ముందుంటే నాగార్జున మెంట‌లిస్ట్ రుద్ర పాత్ర‌లో చ‌క్క‌గా న‌టించాడు. మ‌న‌సులో ఉన్న హ‌వ‌భావాల‌ను క్యాచ్ చేసే వ్య‌క్తిగా మెప్పించాడు. ఇక స‌మంత అందంతో పాటు అభిన‌యంలో మ‌రోసారి త‌న టాలెంట్ ఫ్రూవ్ చేసుకుంది. బబ్లీగా కనిపించిన సామ్, దెయ్యంగా భయపెట్టడంలోనూ సక్సెస్ సాధించింది. ప్రీ క్లైమాక్స్, క్లైమాక్స్ సీన్లలో సమంత నటన కంటతడి పెట్టిస్తుంది. మిగిలిన వాళ్ల‌లో సీర‌త్‌క‌పూర్‌కు న‌ట‌న కంటే గ్లామ‌ర్ షోతో క‌నువిందు చేసింది. వెన్నెల కిశోర్, ప్రవీణ్, షకలక శంకర్ లు భయపడుతూనే నవ్వించారు. అభిన‌య క్లైమాక్స్‌లో స‌మంత‌కు పోటీపోటీగా మెప్పించింది.

ఇక సినిమాలో ఆడ‌పిల్ల‌ల గొప్ప‌త‌నం గురించి, క‌ష్టాలు వ‌చ్చిన‌ప్పుడు వాళ్లు ఎంత ధైర్యంగా ఉండాల‌న్న విష‌యంలో నాగ్ సంద‌ర్భోచితంగా చెప్పిన డైలాగులు బాగున్నాయి. ఫ‌స్టాఫ్‌లో హీరో క్రైమ్ కేసును పోలీసుల సాయంతో సాల్వ్ చేసే సీన్ల‌తో పాటు క్లైమాక్స్‌లో హీరో అస‌లు వ్య‌క్తిని ప‌ట్టుకునే సీన్లు బాగున్నాయి. ఇక ఓంకార్ దెయ్యాన్ని కృత్రిమంగా కాకుండా కాన్సెఫ్ట్ ప్ర‌కారం చూపించిన తీరు బాగుంది. సినిమా ఫ‌స్టాఫ్ కంటే సెకండాఫ్‌లో స‌మంత‌-నాగార్జున సీన్లు, బ‌ల‌మైన ఎమోష‌న‌ల్ కంటెంట్ సినిమాకు ప్ల‌స్ అయ్యింది.

ఇక సినిమాలో మైన‌స్ పాయింట్లు ఉన్నాయి. నాగార్జున్ ఎంట‌ర్ కానంత వ‌ర‌కు క‌థ‌నం పెద్ద‌గా ఉండ‌దు. ఇక సినిమా స్లో నెరేష‌న్‌తో ర‌న్ అవుతుంది. ఓంకార్ మంచి పాయింట్ తీసుకున్నా పాత హ‌ర్ర‌ర్ + కామెడీ జాన‌ర్‌లో వ‌చ్చిన మూడు నాలుగు సినిమాలను మిక్సీలో వేసి ఈ సినిమా తీసిన‌ట్టే అక్క‌డ‌క్క‌డా క‌న‌ప‌డిపోతుంది. రాజుగారి గ‌ది సినిమాకు సిరీస్‌గా సినిమా రూపొందింది క‌దా అని అదే రేంజ్‌లో కామెడీ, హ‌ర్ర‌ర్ సీన్లు ఉంటాయేమోన‌ని ఆశించ‌డం అత్యాశే అవుతుంది.

టెక్నిక‌ల్‌గా ఎలా ఉందంటే….

సాంకేతికంగా చూస్తే థ‌మ‌న్ ఆర్ ఆర్ సినిమాకు పెద్ద ఎస్సెట్‌. దివాక‌ర‌న్ సినిమాటోగ్ర‌ఫీ హ‌ర్ర‌ర్ మూడ్ తీసుకువ‌చ్చింది. పీవీపీ నిర్మాణ విలువ‌లు, అబ్బూరి ర‌వి రాసిన‌ ఎమోష‌న‌ల్ సీన్ల‌లో హార్ట్ ట‌చ్చింగ్ డైలాగ్స్ బాగున్నాయి. ఎడిటింగ్ ఫ‌స్టాఫ్‌లో కాస్త ట్రిమ్ చేయాల్సింది అనిపించినా ర‌న్ టైం త‌క్కువ కావ‌డం కూడా క‌లిసొచ్చేదే.

ఓంకార్ డైరెక్ష‌న్ క‌ట్స్‌:

మ‌ల‌యాళ సినిమాలో మెయిన్ పాయింట్‌ను తీసుకుని దాన్ని తెలుగు ఆడియెన్స్‌కు క‌నెక్ట్ చేస్తూ తెర‌కెక్కించిన తీరుకు అబినందించాలి. ఇది ఎక్క‌డా రీమేక్ సినిమా అన్న డౌటే మ‌న‌కు రాని విధంగా ఓంకార్ సినిమాను డీల్ చేశాడు. నాగార్జున‌, స‌మంత లాంటి స్టార్ కాస్టింగ్ ఉన్నా ఓంకార్ క‌థ‌మీదే బేస్ చేసుకుని సినిమాను న‌డిపించేందుకు ప్ర‌య‌త్నించాడు. చాలా వ‌ర‌కు కొత్త‌టేకింగ్‌తో సినిమాను ప్ర‌జెంట్ చేయ‌డంలో స‌క్సెస్ అయ్యాడు. ఇక స‌మంత నుంచి అమేజింగ్ పెర్పామెన్స్ రాబ‌ట్టుకున్నాడు. అయితే ఫ‌స్టాఫ్‌లో త‌డ‌బ‌డ్డ ఓంకార్‌, ఓవ‌రాల్‌గా రాజు గారి గ‌ది రేంజ్‌లో మాత్రం ఈ సినిమా అవుట్ ఫుట్ తీసుకురాలేక‌పోయాడు.

ప్ల‌స్ పాయింట్స్ (+):

– నాగార్జున – స‌మంత సూప‌ర్బ్ పెర్పామెన్స్‌

– థ‌మ‌న్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌

– నిర్మాణ విలువ‌లు

– క‌దిలించే ఎమోష‌న్స్‌

– సెకండాఫ్‌

– సినిమాటోగ్ర‌ఫీ

– ఓంకార్ డైరెక్ష‌న్‌

మైన‌స్ పాయింట్స్ (-):

– రాజు గారి గ‌దికి కాస్త త‌గ్గ‌డం

– ఫ‌స్టాఫ్‌లో కొన్ని చోట్ల మిస్ అయిన టెంపో

ఫైన‌ల్‌గా….

రాజు గారి గ‌దికి ఫ‌స్ట్ ర్యాంక్‌.. రాజు గారి గ‌ది 2కు సెకండ్ ర్యాంక్‌

TJ రాజు గారి గ‌ది 2 రేటింగ్‌: 2.75 / 5