కోదండ‌రాం క్యాస్ట్ లీక్ చేసిన కేసీఆర్‌

తెలంగాణ ఉద్య‌మంలో త‌న దైన స్టైల్లో మేధావుల‌ని ఐక్యం చేసిన ఘ‌న‌త ప్రొఫెస‌ర్ కోదండ‌రాంకే ద‌క్కుతుంది. కేసీఆర్ ఎంత‌గా పాకులాడినా.. మాస్ క‌దిలారే త‌ప్ప‌.. క్లాస్ పీపుల్ వారి గుమ్మాల‌కే ప‌రిమితం అయిపోయారు. అలాంటి క్ర‌మంలో కోదండ రాం మేధావుల‌ను క‌దిలించారు. త‌న గ‌ళం విప్ప‌డం ద్వారా ఆయ‌న తెలంగాణ మేధావుల ఫోరంను సైతం ఏర్పాటు చేశారు. ఆ విధంగా తెలంగాణ ఉద్య‌మంలో ఆయ‌న చేసిన సేవను గుర్తించే ప్ర‌స్తుత సీఎం… అప్ప‌టికి ఉద్య‌మ నేత కేసీఆర్ కోదండాన్ని చేర‌దీశారు. ఉద్య‌మంలో త‌న వెంట తిప్పుకొన్నారు.

తెలంగాణ సాధ‌న‌లో కోదండ రాం కేసీఆర్‌ల ధ్వ‌యం.. దూసుకుపోయింద‌నే టాక్ వ‌చ్చింది. ఢిల్లీకి వెళ్లి అక్క‌డి పెద్ద‌ల‌ను ఒప్పించ‌డం, వంటా వార్పూ వంటి వినూత్న నిర‌స‌న‌ల‌కు రూప‌క‌ల్ప‌న చేయ‌డం వంటివి కోదండ‌రాం శాంతియుత నిర‌స‌న‌ల‌కు నిద‌ర్శ‌నంగా నిలిచింది. ఉద్య‌మంలో ఆనాడు అలా ముందుకు దూసుకుపోయిన కోదండ రాం.. వ్య‌క్తిగ‌త వివ‌రాల‌ను అప్ప‌ట్లో ఏ ఒక్క‌రూ ప్ర‌శ్నించ‌లేదు. ఆఖ‌రికి కేసీఆర్ కూడా ఎక్క‌డా కోదండం కులం ఏమిటి? మ‌తం ఏమిటి? అని ఎలాంటి ప్ర‌శ్న‌లూ రానివ్వ‌లేదు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. ఇప్పుడు మాత్రం కోదండ రాం కులంపై రాష్ట్రంలో చ‌ర్చ న‌డుస్తోంది! ఆశ్చ‌ర్యంగా అనిపించినా ఇది నిజం.అంతేకాదు, ఈ చ‌ర్చ‌ను లేవ‌నెత్తిందే కేసీఆర్ అని టాక్ ఉంది.

దీని వెనుక రీజ‌న్ ఏంటంటే.. ఒక‌ప్పుడు తెలంగాణ కోసం ఉద్య‌మం సాగించిన కోదండ రాం ఇప్పుడు.. అదే ఉద్య‌మాన్ని.. కేసీఆర్‌, ఆయ‌న ప్ర‌భుత్వంపై ప్ర‌యోగిస్తున్నారు. ముఖ్యంగా సీఎం కొన్ని కోట్ల రూపాయ‌ల ప్ర‌జాధ‌నం ఖ‌ర్చు పెట్టి.. ప్ర‌గ‌తి భ‌వ‌న్‌ను నిర్మించుకోవ‌డం, ప్ర‌స్తుత‌మున్న స‌చివాల‌యాన్ని మార్చేందుకు అన్నీ సిద్ధం చేయ‌డం, దీనికి రూ.350 కోట్ల వ‌ర‌కు ఖ‌ర్చు పెట్టేందుకు రెడీ అవడం, మ‌రోప‌క్క రాష్ట్రంలో విద్యార్థులు ఫీజు రీయింబ‌ర్స్‌మెంట్ కాక ఇబ్బందులు ఎదుర్కొన‌డం వంటి కార‌ణాల నేప‌థ్యం స‌హా.. మ‌ల్ల‌న్న సాగ‌ర్ ప్రాజెక్టు నిర్వాసితుల‌కు అనుకూలంగా కోదండ‌రాం పోరాటాల‌కు సిద్ధమ‌య్యారు.

ఈ ప‌రిణామం ఇప్పుడు కేసీఆర్‌ను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. వేరే విప‌క్షాలు ఏవైనా త‌న‌పై విమ‌ర్శ‌లు చేస్తే.. వాళ్ల నోళ్లు మూయించేందుకు ఏదో ఒక ఆయుధం సిద్ధంగా ఉండేది. కానీ, ఉద్య‌మ నేత కోదండ‌రాం స్వ‌యంగా కేసీఆర్‌పై యుద్ధం ప్ర‌క‌టించే స‌రికి కేసీఆర్ త‌ట్టుకోలేక పోతున్నారు. ఈ క్ర‌మంలోనే కోదండ రాం కులం కార్డును ఆయ‌న బ‌య‌ట‌కు తీసి.. రెడ్డి.. అని.. వ్యాఖ్యానించారు. దీంతో రాష్ట్రంలోని కొన్ని వ‌ర్గాలు ఆయ‌న‌కు దూరం అవుతాయ‌ని కేసీఆర్ భావించి ఉంటారు. ఇదే విష‌యాన్ని కాంగ్రెస్ సీనియ‌ర్ నేత జానా రెడ్డి బ‌య‌ట పెట్టారు. ఉద్య‌మాన్ని నీరు గార్చ‌డం కోస‌మే కేసీఆర్ ఇలా కోదండ‌రాం కులం కార్డు బ‌య‌ట‌కు తీశార‌ని విమ‌ర్శించారు. నిజ‌మే క‌దా!!