టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ ఎం.ఎం. రత్నంకు తెలుగు ఆడియన్స్‌లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. కేవలం నిర్మాతగానే కాకుండా.. గీత రచయితగా, రచయితగా, డైరెక్టర్గా ఇలా ఎన్నో రంగాల్లో సత్తా చాటుకున్న ఎం.ఎం. రత్నం తెలుగు, తమిళ్ ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. 1953 ఫిబ్రవరి 4న నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జన్మించిన ఆయన.. సినిమాపై ఉన్న అమితమైన ప్రేమతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి ఎన్నో కష్టాల తర్వాత అంచలంచలుగా ఎదుగుతూ భారతీయ సినీ దిగ్గజాలలో ఒకరిగా ప్రత్యేక గుర్తింపు దక్కించుకుని రాణిస్తున్నాడు. మేకప్ మ్యాన్గా కెరీర్ ప్రారంభించిన ఆయన.. కర్తవ్యం సినిమాతో ప్రొడ్యూసర్ గా మారి మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకొని చరిత్ర సృష్టించాడు. కేవలం నిర్మాతగానే కాకుండా మల్టీ టాలెంటెడ్ పర్సన్ గా సినీ కెరీర్‌లో ఎల్లప్పుడూ నైతికత, సామాజిక బాధ్యతలతో సినిమాలను రూపొందించారు.
సమాజంపై చెడు ప్రభావాన్ని చూపించే సినిమాలకు ఆయన ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఈ క్రమంలోని మూడు ఫిలింఫేర్ అవార్డులు.. రెండు తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వ అవార్డులతో పాటు.. ఎన్నో ప్రశంసలను దక్కించుకున్న ఆయన ప్రస్తుతం భారీ బడ్జెట్ పీరియాడికల్ డ్రామా హరిహర వీరమల్లు సినిమాకు ప్రొడ్యూసర్గా వ్యవహరిస్తున్నారు. పవన్ కళ్యాణ్‌తో రత్నంకు ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే ఖుషి, బంగారం లాంటి సినిమాలకు కలిసి పని చేసిన ఈ కాంబో రెండు సినిమాలతోనూ మంచి సక్సెస్ అందుకున్నారు. ఖుషి సినిమా టాలీవుడ్ ఎవరి గ్రీన్ మూవీగా నిలిచిపోగా.. బంగారం పవన్ కళ్యాణ్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఈ క్రమంలోనే వీరిద్దరి కాంబోలో మూడో సినిమా హరిహర వీరమల్లు తెరకెక్కనుంది. ఇక పవన్ నటిస్తున్న మొట్టమొదటి పాన్ ఇండియా సినిమా ఇది.
అత్యంత ప్రతిష్టాత్మకంగా.. ఎం.ఎం. రత్నం భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాడు. పవన్ కళ్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా కనిపించనున్నాడు. ఈ యాక్షన్ డ్రామా పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ అయ్యి ఘన సక్సెస్ సాధించడం ఖాయమని రత్నం తాజాగా తన నమ్మకం వ్యక్తం చేశాడు. చివరిగా 2023లో బ్రో సినిమాతో ఆడియన్స్‌ను పలకరించిన పవన్.. దాదాపు రెండేళ్ల తర్వాత హరిహర వీరమల్లతో సిల్వర్ స్క్రీన్‌పై అలరించడానికి సిద్ధమవుతున్నాడు. ఆంధ్రప్రదేశ్ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన పవన్ నుంచి వస్తున్న మొట్టమొదటి సినిమా కావడం.. అది కూడా పవన్ కెరీర్‌లోనే ఫస్ట్ పాన్ ఇండియన్ సినిమా కావడంతో భారీ బడ్జెట్.. పీరియాడికల్ ఫిలిం కావడంతో ఆడియన్స్‌లో అంచనాలు తారస్థాయికి చేరుకున్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందే గొప్ప సినిమాగా హరిహర వీరమల్లు నిలుస్తుందని నిర్మాత ఎం.ఎం. రత్నం నమ్మకాన్ని వ్యక్తం చేశాడు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ నెటింట వైరల్‌గా మారుతున్నాయి.