కుప్పంలో కొత్త ఎత్తు..వైసీపీకి కంచర్ల చెక్ పెట్టగలరా?

వైసీపీ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కుప్పం టార్గెట్ గా ఎలాంటి రాజకీయం చేస్తుందో తెలిసింది. కుప్పంలో చంద్రబాబుకు చెక్ పెట్టే దిశగా రాజకీయం నడిపిస్తుంది. ఈ సారి ఉమ్మడి చిత్తూరు జిల్లాలో కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుచుకోవాలని వైసీపీ పనిచేస్తుంది. మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుప్పం టార్గెట్ గా రాజకీయం నడిపిస్తూ వస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ కొందరు టి‌డి‌పి శ్రేణులని వైసీపీలోకి తీసుకొచ్చారు. పంచాయితీ ఎన్నికల్లో గెలిచారు. స్థానిక సంస్థలు..ఆఖరికి కుప్పం మున్సిపాలిటీని కైవసం చేసుకున్నారు.

అధికార బలంతో కుప్పంలో వైసీపీ గట్టిగానే నిలబడుతుంది. ఈ క్రమంలో చంద్రబాబు అలెర్ట్ అయ్యి..అక్కడ తన బలం తగ్గకుండా చూసుకుంటూ ముందుకెళుతున్నారు. వీలు కుదిరినప్పుడల్లా కుప్పంకు వస్తున్నారు. అక్కడే ఇల్లు కూడా కట్టుకుంటున్నారు. అయితే ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో బాబుకు కుప్పం వెళ్ళే అవకాశాలు తక్కువ ఉన్నాయి. అందుకే ఇటీవల తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచిన కంచర్ల శ్రీకాంత్‌కు కుప్పం బాధ్యతలు అప్పగించారు. ఇదే క్రమంలో ఎమ్మెల్సీ హోదాలో శ్రీకాంత్..కుప్పంలో లోకల్ ప్రోటోకాల్ పొందారు.

కుప్పంలో అధికార హోదా కోసం శ్రీకాంత్ అధికారులకు అర్జీ పెట్టుకోగా,  ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిపల్‌ సెక్రటరీ ముత్యాలరాజు మే నెల 19న ఆదేశాలు జారీ చేశారు. సంబంధిత ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులను తగు చర్యలు తీసుకోవాల్సిందిగా అందులో ఆయన ఆదేశించారు. ఆ వివరాలతో కూడిన కూడిన లేఖ, ప్రిన్సిపల్‌ సెక్రటరీనుంచి కంచర్ల శ్రీకాంత్‌కు అందింది. టీ

శ్రీకాంత్‌కు లోకల్‌ ప్రోటోకాల్‌ లభించడంతో నియోజకవర్గంలో జరిగే ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం లభించింది. ఎక్స్‌ అఫిషియో మెంబర్‌గా కుప్పం మున్సిపల్‌ సమావేశాల్లోనూ పాల్గొనే అవకాశం దక్కింది. దీంతో కుప్పంలో ప్రజలకు అందుబాటులో ఉండటంతో పాటు, అక్కడ రాజకీయంగా వైసీపీకి ధీటుగా పనిచేయడానికి సిద్ధమయ్యారు. చూడాలి మరి శ్రీకాంత్ కుప్పంలో ఏ మేరకు వైసీపీకి చెక్ పెడతారో.