ఆ ఎమ్మెల్యే వద్దంటున్న వైసీపీ నేతలు..ఆ స్థానంలో ఓటమి దిశగా!

అధికార వైసీపీలో అసంతృప్తి సెగలు తీవ్ర స్థాయిలో చెలరేగుతున్నాయి. ఓ వైపు అధిష్టానంపై ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉంటే…ఎమ్మెల్యేలపై కింది స్థాయి నేతలు అసంతృప్తిగా ఉంటున్నారు. ఇలా వైసీపీలో రచ్చ కొనసాగుతూనే ఉంది. తాజాగా ఉమ్మడి విశాఖలో పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబురావుకు వ్యతిరేకంగా వైసీపీ నేతలు ముందుకెళుతున్న విషయం తెలిసిందే. ఆయనపై తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. అసలు ఆయనకు సీటు ఇస్తే తామే ఓడిస్తామని వైసీపీ నేతలు అంటున్నారు.

అలాగే ఉమ్మడి విజయనగరంలోని శృంగవరపుకోట స్థానంలో కూడా ఇప్పుడు పంచాయితీ మొదలైంది. టి‌డి‌పి కంచుకోటగా ఉన్న కోటలో గత ఎన్నికల్లో వైసీపీ నుంచి కడుబండి శ్రీనివాసరావు గెలిచారు. జగన్ గాలిలో గెలిచిన ఈయన ప్రజలకు అందుబాటులో ఉండటం తక్కువ. దీంతో తక్కువ సమయంలోనే ఈయనపై ప్రజా వ్యతిరేకత వచ్చింది. ప్రజలే కాదు..సొంత పార్టీ వాళ్ళు కూడా ఈయన్ని వ్యతిరేకిస్తున్నారు.

ఓ మూడురోజుల క్రితం నియో జకవర్గంలోని ఐదుమండలాల వైసీపీ నేతలు ఏకంగా విశాఖ వెళ్లి వైసీపీ ఉత్తరాంధ్ర కన్వీనర్‌ వైవీ సుబ్బారెడ్డి, ఎంపీ ఎంవీవీ సత్యనారాయణను కలిసి తమకు ఎమ్మెల్యే వద్దని కోరిన సంగతి తెలిసిందే. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చాలని, లేదంటే తాము సహకరించబోమని తేల్చి చెప్పారు. ఇక ఎమ్మెల్యే పలు అక్రమాలకు పాల్పడుతున్నారని ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

ఆ తర్వాత వైసీపీ కీలక నేత రెహ్మన్‌ మాట్లాడుతూ పార్టీని మొదటినుంచి నమ్ముకున్న వారికి విలువ లేదని, మధ్యలో వచ్చిన వారికి విలువ ఇస్తున్నారని మంత్రి బొత్సను ప్రశ్నించారు. మంత్రి తర్వాత మాట్లాడదామని చెప్పిన రెహ్మాన్ వినలేదు. ఇలా ఎస్ కోటలో రచ్చ మాత్రం జరుగుతుంది. ఇప్పటికే అక్కడే టి‌డి‌పి హవా పెరుగుతుంది..ఈ దెబ్బతో టి‌డి‌పి గెలుపు ఫిక్స్ అయ్యేలా ఉంది.