మెగా కాంపౌడ్ నుంచి వచ్చిన హీరోల్లో అల్లు అర్జున్ ఒకడు. అయితే గత కొంత కాలం నుంచి మెగా ఫ్యామిలీ అల్లు అర్జున్ ను దూరం పెట్టిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. దానికి తోడు మెగా ట్యాగ్ ను పక్కన పడేసిన బన్నీ.. అల్లు బ్రాండ్ ను గట్టిగా ప్రమోట్ చేసుకుంటున్నారు. అల్లు ఫ్యాన్స్ అంటూ కొత్త అసోషియేషన్ కూడా వచ్చింది.
ఈ నేపథ్యంలోనే అల్లు అర్జున్ తో మెగా ఫ్యామిలీకి విభేదాలు ఏర్పడ్డాయంటూ వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఈ విషయంపై స్పందించారు. ఎట్టకేలకు అసలు గుట్టంతా బట్టబయలు చేశారు. `వాల్తేరు వీరయ్య` ప్రమోషన్స్ లో భాగంగా చిరంజీవి ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ తో విభేదాలు అన్న వార్తలపై ఆయన స్పందించారు.
`అలాంటి వార్తలు ఎందుకు వస్తాయో తెలియదు. పవన్ కళ్యాణ్ ఎదగాలని కోరుకుంటాను.. రామ్ చరణ్ ఎదగాలని కోరుకుంటాను.. అలాగే అల్లు అర్జున్ ఎదుగుతున్నా నాకు ఆనందంగానే ఉంటుంది. ప్రతిసారీ నా పేరుని అల్లు అర్జున్ ప్రస్తావించాలని ఎందుకు అనుకుంటారు.? ఆ పేరు చెప్పి ఎందుకు వివాదాలు సృష్టిస్తారు. మా మధ్య ఎలాంటి విభేదాలు లేవు. ఇలాంటివి విన్నప్పుడు చాలా ఇరిటేటింగ్‌గా ఉంటుంది.` అంటూ చిరంజీవి పేర్కొన్నారు.