ఫ్యాన్స్‌కి తారక్ కంటే బాలయ్యపైనే ఎక్కువ లవ్.. కారణం అదేనా..?

టీడీపీ అభిమానులు, మద్దతుదారులకు జూనియర్ ఎన్టీఆర్ కన్నా బాలకృష్ణ పైనే ఎక్కువగా ప్రేమ ఉందా అని అడిగితే అవుననే సమాధానాలు వినిపిస్తున్నాయి. ఎందుకలా అనే విషయంపై ఒక వివరణాత్మక ప్రచారం కూడా జరుగుతోంది. నటసింహం నందమూరి బాలకృష్ణ ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడిని తన అన్‌స్టాపబుల్ షోకు అతిథిగా తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఈ షో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో సంచలనంగా మారిందనే చెప్పాలి. అధికార పార్టీ వైసీపీ ఈ షో ఎపిసోడ్‌కి వచ్చిన ప్రజాదరణను చూసి కలవరపాటుకు కూడా గురైందట.

యూట్యూబ్ ఇండియా ట్రెండ్స్ లిస్ట్‌లో ఈ ఓటీటీ షో ఎపిసోడ్ ప్రోమో ట్రెండింగ్‌లో నంబర్ 1గా నిలిచింది. ఇది నిజంగా ఆశ్చర్యకరమైన విషయమే. ఈ పాపులారిటీని దక్కించుకోవడం అటు రాజకీయాలు, ఇటు సాధారణ ప్రజల్లో చర్చనీయాంశం అయింది. ఈ షోలో చంద్రబాబు పై ఎక్కువగా వినిపించే ఆరోపణ ‘వెన్నుపోటు’ గురించి కూడా బాలకృష్ణ చర్చించాడు. 1995లో సీనియర్ ఎన్టీఆర్ నుంచి తెలుగుదేశం పార్టీని చంద్రబాబు తన చేతుల్లోకి తీసుకోవడం వెనుక జరిగిన వ్యవహారాన్ని మొత్తం అందరికీ తెలియజేసేలా చంద్రబాబును ప్రశ్నించాడు. టీడీపీని హ్యాండోవర్ చేసుకోవడంలో చంద్రబాబుది తప్పు ఏమీ లేదని బాలకృష్ణ ఈ సందర్భంగా తేల్చాడు.

చాలా సున్నితమైన ఈ విషయం గురించి అందరిముందు ప్రస్తావించి ఓ రకంగా బాలకృష్ణ భారీ రిస్క్ తీసుకున్నాడు. ఇలాంటి విషయాలు మాట్లాడుతున్నప్పుడు ఏ చిన్న తప్పు చేసినా టీడీపీ ప్రతిపక్షాలు జీవితాంతం ఆయనను కార్నర్ చేయవచ్చు. అయితే, బాలయ్య తన సొంత పలుకుబడిని, రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి పార్టీ ప్రయోజనాలే తనకు ప్రధానమని నిరూపించాడు. సమాజంలో చంద్రబాబు వెన్నుపోటుదారుడని ఉన్న ఒక ఆరోపణపై క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు.

జూనియర్ ఎన్టీఆర్, బాలకృష్ణ మధ్య ఉన్న ప్రధాన వ్యత్యాసం అదేనని టీడీపీ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ప్రామిస్ చేస్తున్నారు. ఎన్టీఆర్ కూతురిని దుర్భాషలాడటం, ఎన్టీఆర్ యూనివర్సిటీ పేరు మార్పు వంటి కీలకమైన విషయాలపై స్పందించేటప్పుడు కూడా తారక్ జగన్‌కు ఇబ్బంది కలగకుండా మాట్లాడారని వారు అంటున్నారు. మరోవైపు బాలయ్య పూర్తిగా పార్టీ వైపే మాట్లాడుతున్నాడని.. హార్డ్ కోర్ టీడీపీ అభిమానులు జూనియర్ కంటే బాలయ్యను ఇష్టపడుతున్నారని టీడీపీ మద్దతుదారులు చెబుతున్నారు.