స్టార్ హీరోయిన్లుగా ఉంటూ మ‌ర‌ణించిన న‌టీమ‌ణులు వీళ్లే… ఎవ‌రు ఏ కార‌ణంతో అంటే…!

వెండితెరపై ఆడి పాడి ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కొందరు హీరోయిన్లు మన మధ్య లేరు. ఇది మనకు కొంత బాధగానే ఉంటుంది. వీరిలో కొంతమంది నటీమణులు మాత్రం చిన్న వయసులోనే మరణించారు.ఇది చాలా దురదృష్టకరం. చిన్న వయసులోనే మరణించిన హీరోయిన్స్ ఎవరో ఇప్పుడు చూద్దాం.

మహానటి సావిత్రి :
మహానటి సావిత్రి తన నటనతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు. ఆమె 70 – 80వ ద‌శ‌కంలో స్టార్ హీరోయిన్‌గా సౌత్ సీమ‌ను అలరించారు. అప్పటి స్టార్ హీరోస్ అయిన ఎన్టీఆర్- ఏఎన్నార్ వంటి అగ్ర హీరోలు కూడా ఈమె డేట్స్ కోసం ఎదురు చూశారంటే ఈవిడ ఎంత గొప్ప హీరోయిన్ మనం అర్థం చేసుకోవాలి. ఈమె నటనకు ఎంత ప్రాముఖ్యత ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఎంతో పేరు తెచ్చుకున్న ఈవిడ చివరక్షణాల్లో చాలా బాధను అనుభవించింది. 46 ఏళ్ల వయసులోనే సావిత్రి దుర‌ల‌వాట్ల‌తో మ‌ర‌ణించారు.

 

దివ్యభారతి :
వెంకటేష్ నటించిన బొబ్బిలి రాజా సినిమాతో తెలుగు సినీ పరిశ్రమకు దివ్యభారతి పరిచయమైంది. చిరంజీవి- బాలకృష్ణ- వెంకటేష్- మోహ‌న్‌బాబు వంటి అగ్ర హీరోలతో నటించి.అగ్ర హీరోయిన్‌గా ఎదుగుతున్న సమయంలో అందరూ అనుకోని విధంగా 19 సంవత్సరాలకే భ‌వ‌నంపై నుంచి ప‌డి అనుమానాస్ప‌ద రీతిలో మరణించింది.

సౌందర్య :
మహానటి సావిత్రి గారి తర్వాత మహానటిగా పేరు తెచ్చుకున్న స్టార్ హీరోయిన్ సౌందర్య అందరికీ సుపరిచితురాలు. ఆమె తెలుగులో స్టార్ హీరోలు అందరితో నటించింది. అన్ని భాషల్లో కలిపి 100కు పైగా చిత్రాల్లో నటించింది. సౌందర్య 33 ఏళ్ల వయసులోనే హెలికాప్టర్ ప్రమాదంలో మరణించింది.

ఆర్తి అగర్వాల్ :
తెలుగులో నువ్వు నాకు నచ్చావ్ సినిమాతో తెలుగు హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది మొదటి సినిమాతోనే సూపర్ డూపర్ హిట్ కొట్టిన ఆర్తి అగర్వాల్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగు సినీ రంగంలో 2000వ ద‌శ‌కంలో అగ్ర హీరోలుగా కొనసాగుతున్న చిరంజీవి -వెంకటేష్- బాలకృష్ణ- నాగార్జున సరసన న‌టించ‌టమే కాకుండా యువ హీరోలు ఎన్టీఆర్- మహేష్ బాబు -తరుణ్ వంటి కుర్ర హీరోలతో కూడా ఈమె నటించింది. అయితే బ‌రువు త‌గ్గేందుకు ఆమె చేయించుకున్న ఆప‌రేష‌న్ విక‌టించి కేవలం 31 ఏళ్ల వయసులోనే మరణించింది.

సిల్క్ స్మిత :
70 ,80వ ద‌శ‌కంలో సిల్క్ స్మిత అంటే ఒక బ్రాండ్. ఆమె సినిమా వస్తుందంటే కుర్రకారుకు గుండెల్లో గుబులు, రైళ్లు పరుగులెత్తేవి. తెలుగులో అందరి అగ్ర హీరోలు సినిమాల్లో ఈమె నటించింది. సినీ రంగంలో ఓ వెలుగు వెలిగి… నిర్మాతగా చేసి తన చివరి రోజుల్లో చాలా కష్టాలు పాలయ్యింది. ఈమె కేవలం 35 ఏళ్ల వయసులోని మరణించింది.