పెద్ది సినిమాలో తారక్ అలా కనిపిస్తాడా?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ రీసెంట్‌గా ‘ఆర్ఆర్ఆర్’ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు తారక్ తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. ఈ క్రమంలో తన 30వ చిత్రాన్ని దర్శకుడు కొరటాల శివ డైరెక్షన్‌లో తీసుకొచ్చేందుకు రెడీ అవుతున్న జూనియర్ ఎన్టీఆర్, ఆ తరువాత ఎవరితో చేస్తాడా అనేది ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ క్రమంలోనే ఉప్పెన చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన బుచ్చిబాబు సానా, తారక్ కోసం ఓ పవర్‌ఫుల్ కథను రెడీ చేశాడట. ఇప్పటికే తారక్‌కు కూడా ఈ కథను వినిపించాడట. అయితే ఇదొక స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌తో రాబోయే కథ అని ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో తారక్ పాత్రకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

‘పెద్ది’ అనే టైటిల్‌తో రాబోయే ఈ సినిమాలో తారక్ అంగవైకల్యం ఉన్న పాత్రలో కనిపిస్తాడట. ఈ వార్తతో తారక్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. తారక్ నిజంగా ఇలాంటి పాత్రను ఓకే చేశాడా అని వారు ప్రశ్నిస్తున్నారు. అయితే నిజంగా తారక్ ఇలాంటి పాత్రను ఓకే చేస్తే మాత్రం అది డేరింగ్ నిర్ణయం అని చెప్పాలి. స్టార్‌డమ్ ఉన్న హీరో ఇలాంటి పాత్రను చేస్తే, ఆ సినిమాలో ఆయన పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఇట్టే ఊహించుకోవచ్చు. మరి పెద్ది చిత్రం కోసం తారక్ నిజంగా ఇలాంటి రిస్క్ తీసుకుంటాడా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.