నాని టక్ జగదీష్ రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: టక్ జగదీష్
నటీనటులు: నాని, రీతూ వర్మ, జగపతి బాబు, తదితరులు
సంగీతం: ఎస్.థమన్
సినిమాటోగ్రఫీ: ప్రసాద్ మూరెళ్ల
నిర్మాణం: షైన్ స్క్రీన్స్
దర్శకత్వం: శివ నిర్వాణ
రిలీజ్ డేట్: సెప్టెంబర్ 10, 2021

న్యాచురల్ స్టార్ నాని నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘టక్ జగదీష్’ ప్రేక్షకుల్లో ఎలాంటి అంచనాలు క్రియేట్ చేసిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాను నాని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూశారు. అయితే కరోనా కారణంగా ఈ సినిమాను థియేటర్లలో రిలీజ్ చేయలేక, నేరుగా అమెజాన్ ప్రైమ్‌లో వినాయక చవితి కానుకగా రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. కానీ రిలీజ్ డేట్ కంటే ముందే ఈ సినిమాను స్ట్రీమింగ్‌లో పెట్టారు చిత్ర యూనిట్. మరి ఈ సినిమా నాని కెరీర్‌కు ఎలాంటి రిజల్ట్‌ను అందించిందో రివ్యూలో చూద్దాం.

కథ:
జగదీష్ నాయుడు(నాని) పట్నంలో చదువుకుంటూ ఉంటాడు. అతడికి తన కుటుంబం అంటే ఎంతో ప్రేమ. ఈ క్రమంలో అతడి తండ్రి(నాజర్) హఠాత్తుగా చనిపోతాడు. దీంతో ఇంటి బాధ్యతలను తన అన్న బోస్ బాబు(జగపతి బాబు)కి అప్పగించి వెళ్తాడు జగదీష్. కట్ చేస్తే.. జగదీ తిరిగి వచ్చే సరికి అతడి మేనకోడలు చంద్రమ్మ(ఐశ్వర్యా రాజేష్)కు వేరొక వ్యక్తితో పెళ్లి చేస్తారు. అటు ఊరి జనం కూడా తమ కుటుంబంపై తీవ్ర ఆగ్రహంగా ఉంటారు. ఇంతకీ చంద్రమ్మ ఎవరిని పెళ్లి చేసుకుంది? ఊరిలో తమ కుటుంబం పరువు ఎవరు తీశారు? జరిగిని పరిణామాలకు ఎవరు బాధ్యులు? అనేది సినిమా కథగా చిత్ర యూనిట్ మనకు చూపించారు.

విశ్లేషణ:
నాని సినిమాలు అంటే ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు క్రియేట్ అవుతూ ఉంటాయి. అయితే టక్ జగదీష్ చిత్రానికి వచ్చే సరికి ఈ సినిమాపై అంచనాలకంటే ఎక్కువగా వివాదాలే నెలకొన్నాయి. దీంతో ఈ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ సినిమాను థియేటర్లలో కాకుండా అమెజాన్ ప్రైమ్‌లో రిలీజ్ చేసేందుకే చిత్ర యూనిట్ మక్కువ చూపించడంతో ఈ సినిమా ఎలా ఉంటుందా అని అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ఇక ఈ సినిమా కథ విషయానికి వస్తే.. ఫస్టాఫ్‌లో హీరో తన కుటుంబంతో గడిపే హ్యాపీ మూమెంట్స్, తనకు ఎదురయ్యే ఓ మంచి అమ్మాయిని ప్రేమించడం, ఇంట్లో సమస్యలను అన్నయ్యకు అప్పగించడం లాంటి సీన్స్‌తో నింపేశాడు డైరెక్టర్. ఈ క్రమంలో కథనంలో చాలా బోరింగ్ అంశాలు మనకు కనిపిస్తాయి. అయితే ఇంటర్వెల్ బ్యాంగ్‌లో హీరో నాని తన ఊరికి ఎమ్మార్వోగా రావడంతో సెకండాఫ్‌పై ఆసక్తిని రేకెత్తించారు చిత్ర యూనిట్.

ఇక సెకండాఫ్‌లో జగదీష్ నాయుడు తన కుటుంబంలో చెలరేగిన కలహాలు, ఊరి సమస్యలను పరిష్కరించే క్రమంలో అతడు తెలుసుకునే నిజాలను మనకు చూపించారు. అయితే తన కుటుంబంలోని ఓ వ్యక్తి మారడంతో ఇవన్నీ జరిగాయని గ్రహించి, అతడిని మార్చుకునే విధానం ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. ఇక ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో జగదీష్ నాయుడు తన కుటుంబ సమస్యలు, ఊరి సమస్యలను ఎలా పరిష్కరించారనేవి మనకు చూపించి మెప్పించారు చిత్ర యూనిట్. మొత్తంగా ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కే ప్రాముఖ్యతను ఇచ్చిన చిత్ర యూనిట్, దానికి సంబంధించిన అంశాలనే ఎక్కువగా చూపించే ప్రయత్నం చేశారు. అయితే ఈ అంశాలు కొన్ని వర్గాల ప్రేక్షకులను మాత్రమే మెప్పిస్తాయిని చెప్పాలి.

నటీనటుల పర్ఫార్మెన్స్:
జగదీష్ నాయుడు పాత్రలో నాని పర్ఫార్మెన్స్ చాలా పవర్‌ఫుల్‌గా ఎలివేట్ చేశారు చిత్ర యూనిట్. ఈ సినిమాలో నాని చెప్పే డైలాగులు, అతడి మేనరిజం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుంటుంది. ఇక హీరోయిన్‌గా రీతూ వర్మ పాత్ర చెప్పుకోదగ్గ ప్రాముఖ్యతను సంతరించుకోలేదు. ఆమె పాత్ర కేవలం హీరోయిన్ ఉండాలనే ఉద్దేశ్యంతో తీర్చిదిద్దినట్లు కనిపించింది. అటు ఐశ్వర్యా రాజేష్ లాంటి టాలెంటెడ్ నటిని కూడా ఈ సినిమాలో వృథా చేశారు. మిగతా వారు తమ పాత్రల వరకు ఓకే అనిపించారు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు శివ నిర్వాణ ‘నిన్ను కోరి’, ‘మజిలీ’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత్ టక్ జగదీష్ చిత్రాన్ని తెరకెక్కిస్తుండటంతో ఈ సినిమాలో ఏదో ఒక కొత్తదనం మనకు చూపిస్తాడని అందరూ ఆశించారు. కానీ ఈ సినిమాలో అలాంటి అంశాన్ని ఏదీ ఆయన టచ్ చేయలేదు. దీంతో ఈ సినిమా కేవలం ఫ్యామిలీ ఆడియెన్స్‌ను దృష్టిలో పెట్టుకుని చేసిన సినిమాగా మనకు కనిపిస్తుంది. అయితే ఈ సినిమా కథలో పస లేకపోవడం ప్రేక్షకులను తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. ఇక సంగీతం విషయానికి వస్తే ఈ సినిమాలో పెద్దగా చెప్పుకునే పాటలు ఏమీ లేకపోవడం, బీజీఎం కూడా సోసోగా ఉండటం మైనస్ అని చెప్పాలి. అటు సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ పనుల గురించి కూడా చెప్పుకునే స్థాయిలో ఏమీ లేవు. నిర్మాణ విలువలు చూస్తే ఈ సినిమా నిర్మాతలు ఓటీటీ రిలీజ్‌కు ఎందుకు ఆసక్తి చూపారో అర్థం అవుతుంది.

చివరిగా:
టక్ జగదీష్: థియేటర్ రిలీజ్ ఎందుకు వద్దాన్నారో తెలిసింది!

రేటింగ్:
2.5/5.0