వైసీపీలో కేవీపీ బావ‌మ‌రిది స‌త్తా ఎంత ?

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లా చింత‌ల‌పూడి నియోజ‌క‌వ‌ర్గ అధికార వైసీపీలో కొద్ది రోజులుగా గ్రూపు రాజ‌కీయాల ర‌గ‌డ జ‌రుగుతోంది. ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఏలూరు ఎంపీ కోట‌గిరి శ్రీథ‌ర్ – మాజీ ఏఎంసీ చైర్మ‌న్ మేడ‌వ‌ర‌పు అశోక్‌బాబు ( సీనియ‌ర్ పార్ల‌మెంటేరియ‌న్ కేవీపీ రామ‌చంద్ర‌రావు బావ‌మ‌రిది) ఓ వైపు .. చింత‌ల‌పూడి ఎమ్మెల్యే వీఆర్‌. ఎలీజా, ఆయ‌న అనుచ‌రులు మ‌రోవైపుగా ఉంటూ రాజ‌కీయం చేస్తూ వ‌స్తున్నారు. ఎంపీగా శ్రీధ‌ర్ ఉన్నా చింత‌ల‌పూడి వ‌ర‌కు అశోక్ వ్యూహాలు పార్టీలో ఎప్పుడూ కీల‌కంగానే ఉంటాయి. కొద్ది రోజులుగా ఎమ్మెల్యే ఎలీజా ఎంపీ వ‌ర్గంతో ఢీ అంటే ఢీ అనే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తున్నారు.

ఆయ‌న అనుచ‌రులు సైతం సోష‌ల్ మీడియాలో నియోజ‌క‌వ‌ర్గ చ‌రిత్ర‌లోనే లేన‌ట్టుగా త‌మ నేత 36 వేల ఓట్ల మెజార్టీతో గెలిచార‌ని.. త‌మ నేత‌ను కావాల‌నే కొంద‌రు అణ‌గ‌దొక్కుతున్నార‌ని ప్ర‌చారం చేస్తున్నారు. 36 వేల ఓట్ల మెజార్టీ వ‌చ్చిందంటే అదంతా ఎలీజా బ‌ల‌మేనా ? అని ప్ర‌శ్నించుకుంటే చాలా సందేహాలు క‌ల‌గ‌క మాన‌వు. గ‌త అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు ముందు చింత‌ల‌పూడి వైసీపీలో నాయ‌క‌త్వ శూన్య‌త ఉంది. పార్టీ అధిష్టానం ముగ్గురు ఇన్‌చార్జ్‌ల‌ను మార్చింది. గ‌త ఎన్నిక‌ల‌కు రెండేళ్ల ముందు నుంచే అశోక్ నాడు ఎంపీ అభ్య‌ర్థిగా ఉన్న శ్రీధ‌ర్‌తో క‌లిసి నాడు టీడీపీ కంచుకోట‌గా ఉన్న చింత‌ల‌పూడిలో పార్టీకి బ‌ల‌మైన పునాదులు వేసుకుంటూ వ‌చ్చారు.

ఎలీజా భారీ మెజార్టీకి అశోక్‌, కోట‌గిరి కార‌ణం కాదా ?
ప్ర‌తి మండ‌లంలో… ప్ర‌తి గ్రామంలో ప‌ర్య‌టిస్తూ కీల‌క నేత‌ల‌ను, కేడ‌ర్‌ను వైసీపీ వైపున‌కు తిప్పేందుకు చాలా క‌ష్ట‌ప‌డ్డారు. ఎక్క‌డిక‌క్క‌డ టీడీపీని క‌ట్ట‌డి చేస్తూ… స‌మావేశాలు పెడుతూ సొంత డ‌బ్బు కూడా భారీగా ఖ‌ర్చు చేస్తే కాని ఎన్నిక‌ల్లో ఎలీజాకు అంత మెజార్టీ రాలేదు. ఈ విష‌యాన్ని ఎవ్వ‌రూ కాద‌న‌లేరు. అయితే ఇంత మెజార్టీకి కార‌ణం అశోక్‌ ప‌డిన క‌ష్టంతో పాటు జ‌గ‌న్ భారీ ప్ర‌భంజ‌నంకు తోడు… ఇది ఎంపీ కోట‌గిరి శ్రీధ‌ర్ సొంత నియోజ‌క‌వ‌ర్గం కావ‌డం.. ఇది కోట‌గిరి ఫ్యామిలీ కంచుకోట కావ‌డం ఇవ‌న్నీ కూడా ఎలీజా భారీ మెజార్టీకి కార‌ణాలు. ఇవ‌న్నీ వ‌దిలేసి ఇప్పుడు భారీ మెజార్టీతో గెలిచిన త‌మ నేత‌ను తొక్కేస్తున్నార‌ని అవాకులు చెవాకులు పేల‌డం, పైగా కుల కోణాలు తీసుకు రావ‌డం క‌రెక్ట్ కాద‌ని వైసీపీలోనే కొంద‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నారు.

స్థానిక ఎన్నిక‌ల్లో ఎలీజా మ‌ద్ద‌తుదారుల ఘోర‌ప‌రాభ‌వం :
కొద్ది రోజుల క్రితం జ‌రిగిన పంచాయ‌తీ ఎన్నిక‌ల్లో ఎంపీ శ్రీధ‌ర్ సొంత మండ‌లంలో టీడీపీ కంచుకోట‌లుగా ఉన్న పంచాయ‌తీల్లో వైసీపీని గెలిపించేందుకు శ్రీధ‌ర్‌, అశోక్ ప్ర‌తిష్టాత్మ‌కంగా తీసుకున్నారు. అయితే ఎలీజా ఈ ఎన్నిక‌ల్లో కొన్నిచోట్ల ప్ర‌తిప‌క్షానికి చెందిన నేత‌ల‌తో కుమ్మ‌క్క‌య్యార‌న్న చ‌ర్చ‌లు కూడా న‌డిచాయి. ఆయ‌న సొంతంగా మండ‌ల కేంద్ర‌మైన కామ‌వ‌ర‌పుకోట‌తో పాటు వీరిశెట్టిగూడెం అటు నియోజ‌క‌వ‌ర్గ కేంద్ర‌మైన చింత‌ల‌పూడి మండ‌లంలో త‌న ఫ్యానెల్స్‌ను కూడా రెబ‌ల్స్‌గా బ‌రిలోకి దింపారు. అయితే ఎలీజా ఫ్యానెల్స్ అన్ని చోట్లా ఘోరంగా ఓడిపోయాయి. కామ‌వ‌ర‌పుకోట‌లో అయితే ఎంపీ వ‌ర్గం స‌ర్పంచ్ అభ్య‌ర్థికి 1500 ఓట్లు మెజార్టీ వ‌స్తే.. ఎమ్మెల్యే నిల‌బెట్టిన వ్య‌క్తికి కేవ‌లం 1200 ఓట్లు మాత్ర‌మే వ‌చ్చాయి.

పార్టీని న‌మ్ముకున్నోళ్ల‌కు న్యాయం చేయ‌డ‌మే అశోక్‌, శ్రీధ‌ర్ చేసిన త‌ప్పా ?
ఎంపీ శ్రీధ‌ర్ తండ్రి దివంగ‌త కోట‌గిరి విద్యాధ‌ర‌రావుపై లింగ‌పాలెం మండ‌లానికి చెందిన క‌మ్మ సామాజిక వ‌ర్గ నేత మంద‌ల‌పు స‌త్య‌నారాయ‌ణ ప‌లుసార్లు కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అయితే ఇప్పుడు ఆయ‌న త‌న‌యుడు మంద‌ల‌పు సాయిబాబ‌కు ఎంపీ, అశోక్ పట్టుబ‌ట్టి మ‌రీ చింత‌ల‌పూడి ఏఎంసీ చైర్మ‌న్ ప‌ద‌వి క‌ట్ట‌బెట్టారు. ఒక‌ప్పుడు త‌మ కుటుంబానికి ప్ర‌త్య‌ర్ధులు అయినా కూడా వీరు పార్టీ కోసం క‌ష్ట‌ప‌డ్డార‌నే ప‌ద‌వులు ఇప్పించారు. పార్టీ కోసం క‌ష్ట‌ప‌డిన వారికి, నాలుగు ఓట్లు ఉన్న నేత‌ల‌కు న్యాయం చేయాల‌ని ఎంపీ శ్రీధ‌ర్‌, అశోక్ భావిస్తుంటే… నాలుగు ఓట్లు లేకుండా.. దందాలు చేసే వారిని, బెదిరించే వారిని ఎంక‌రేజ్ చేయడం క‌రెక్ట్ కాద‌ని ఎంపీ వ‌ర్గం నేత‌లు ఆరోపిస్తున్నారు. ఏదేమైనా చింత‌ల‌పూడి కోట‌గిరి సొంత నియోజ‌క‌వ‌ర్గం.. పార్టీల‌తో సంబంధం లేకుండా ఇక్క‌డ ఓటింగ్ వీరి సొంతం… ఇక్క‌డ ఎంపీతో కావాల‌ని క‌య్యానికి కాలుదువ్వితే వారికే న‌ష్టం అన్న చ‌ర్చ‌లు కూడా స్థానికంగా జ‌రుగుతున్నాయి.