కేసీఆర్ లో ఈ మార్పునకు కారణం ఈటలేనా?

కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు.. టీఆర్ఎస్ చీఫ్.. రాష్ట్ర ముఖ్యమంత్రి.. ఆయన ఎవరు చెప్పిందీ వినరు.. అనుకున్నది చేస్తారు.. అంతే.. ఇదీ ఇన్నాళ్లూ కేసీఆర్ పై పార్టీ శ్రేణులు, ప్రభుత్వ పెద్దల్లో ఉన్న అభిప్రాయం. మీడియా సమావేశాల్లోనూ అంతే.. ఆయన చెప్పేది వినాల్సిందే.. ఎవరి ప్రశ్నకైనా సమాధానం చెప్పాలంటే ఎదురు దాడే.. అయితే ఇటీవల కాలంలో గులాబీ బాస్ లో మార్పు కనిపిస్తోంది. ఎవరు చెప్పినా వింటున్నారు.. మాట్లాడేందుకు అవకాశమిస్తున్నారు.. దీంతో కారు పార్టీలో కార్యకర్తలు, నాయకులు ఖుషీ అవుతున్నారు. అరె.. బాస్ లో ఇంత మార్పు వచ్చిందా అని వారు ఆశ్చర్యపోతున్నారు. ఈ చేంజ్ కు కారణం పరోక్షంగా మాజీ మంత్రి ఈటల రాజేందర్ అని భావిస్తున్నారు. అందుకే లోలోపలే ఈటలకు థ్యాంక్స్ చెబుతున్నారట.

నిన్న జరిగిన పార్టీ కార్యవర్గ సమావేశంలో కేసీఆర్ ప్రవర్తన తీరులో మార్పు కొట్టొచ్చినట్టు కనిపించింది. టీఆర్ఎస్ నాయకులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మంత్రులు తమ కళ్లను తామే నమ్మలేకపోయారట. గతంలో జరిగిన సమావేశాలకు, ఈసారి జరిగిన సమావేశానికి పోల్చుకుంటున్నారు. గతంలో జరిగిన పార్టీ కార్యక్రమాల్లో కేసీఆర్ ఒక్కరే మాట్లాడేవారు.. విమర్శనాత్మకంగా మాట్లాడేవారు.. అందరినీ కాస్త పరుషంగానే కామెంట్ చేసేవారు. అయితే మంగళవారం జరిగిన రెండున్నర గంటల సమావేశంలో అంతా కూల్.. కూల్ గా ఉండిపోయింది. ఇతర నాయకులకు మైక్ ఇచ్చి వారు చెప్పింది ఆసాంతం విన్నారు. పార్ట పరంగాకానీ, ప్రభుత్వ పరంగాకానీ మీరు ఎదుర్కొంటున్న సమస్యలు నిర్మొహమాటంగా చెప్పండని కోరారట. ఇక సమావేశం ముగిసిన తరువాత నాయకులందరూ చిరునవ్వుతో బయటకు వచ్చారు. బాస్ చేంజ్ అయ్యారు.. ఇక మంచిరోజులే.. అని తమలో తాము మాట్లాడుకున్నారట కూడా. ఏదేమైనా దీనికి కారణం పార్టీలో అగ్రనేతగా చెలామణి అయిన ఈటల ఇపుడు కేసీఆర్ పై విమర్శలు చేస్తుంటే.. భవిష్యత్తులో అలా జరుగకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం.