అన్‌లాక్‌కు సిద్దమవుతున్న తెలంగాణ స‌ర్కార్‌..ప్ర‌క‌ట‌న ఎప్పుడంటే?

స‌ద్దుమ‌ణిగింది అనుకున్న క‌రోనా వైర‌స్ మ‌ళ్లీ సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో ప్ర‌తి రోజు ల‌క్ష‌ల్లో పాజిటివ్ కేసులు, వేల‌ల్లో మ‌ర‌ణాలు న‌మోదు అయ్యాయి. తెలంగాణ‌లోనూ సెకెండ్ వేవ్‌లో క‌రోనా విశ్వ‌రూపం చూప‌డంతో.. కేసీఆర్ స‌ర్కార్ వెంట‌నే లాక్‌డౌన్ విధించారు.

ప్ర‌స్తుతం మ‌ళ్లీ రాష్ట్రంలో క‌రోనా కేసులు మ‌రియు మ‌ర‌ణాలు అదుపులోకి వ‌చ్చాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం అన్‌లాక్ కు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టు విశ్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ద్వారా తెలుస్తోంది. ఇప్పుడు రాష్ట్రంలో కొన‌సాగుతున్న లాక్‌డౌన్ జూన్ 9వ తేదీతో ముగియనుంది. ఈ నేప‌థ్యంలోనే తెలంగాణ కేబినెట్ భేటీకి ముహూర్తం ఖ‌రారైంది. ఎల్లుండి(జూన్ 8) మధ్యాహ్నం 2 గంట‌ల‌కు రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది.

ఈ భేటీ అనంత‌రం లాక్‌డౌన్ ఎత్తివైత‌పై అధికారిక ప్ర‌క‌ట‌న చేయ‌నున్నారు. ఇక ఈ కేబినెట్ భేటీలో లాక్‌డౌన్ ఎత్తివేత‌తో పాటు కరోనా పరిస్థితులు, వైర‌స్ క‌ట్ట‌డికి శాఖల వారీగా తీసుకోవాల్సిన చ‌ర్య‌లు, క‌రోనా మూడోద‌శ విజృంభ‌ణ‌కు స‌న్న‌ద్ధం, వైద్యం, నీటిపారుదల ప్రాజెక్టుల పనుల పురోగతి, చేపట్టాల్సిన చర్యలపై మంత్రుల‌తో సీఎం కేసీఆర్ చ‌ర్చించ‌నున్నారు.