కేసీఆర్‌పై ఈట‌ల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు..!

అసైన్డ్ భూముల కొనుగోలు వ్యవహారంలో ఒక్క‌సారిగా మంత్రి ఈటల రాజేందర్ హాట్ టాపిక్‌గా మారారు. దీంతో కేసీఆర్‌తో దీర్ఘకాలంగా ఉన్న అనుబంధం ఒక్కసారిగా తెగిపోయింది. పైకి గంభీరంగా క‌నిపిస్తున్నా అనూహ్య పరిణామాలతో ఆయన దిక్కుతోచని స్థితికి గురయ్యారు. షామీర్‌పేట ఫామ్‌హౌజ్‌కే పరిమితమైన మంత్రి ఈటల రాజేందర్ ఒక ప‌త్రిక‌తో త‌న మ‌నోభావాలను పంచుకున్నారు. ఈ సంద‌ర్భంగా ముఖ్య‌మంత్రి కేసీఆర్‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. తాను ఒక్క ఇంచు భూమిని కూడా కబ్జా చేయలేద‌ని, కానీ వంద శాతం నన్ను ఇరికించడానికి దీన్ని ఒక సాకుగా తెరపైకి తెచ్చార‌ని, పార్టీ అధిష్టానం ప్రమేయం లేకుండా ఇది జరిగిందని అనుకోవడంలేద‌ని, త‌న‌ను వదిలించుకోవాలనే కేసీఆర్ నా క్యారెక్టర్‌ మీద దెబ్బకొడుతున్నార‌ని ధ్వ‌జ‌మెత్తారు. అదీగాక కేసీఆర్‌కు ఇప్పుడు ఉద్యమ బంధాలు, మానవ అనుబంధాలు, సంబంధాలు అంతకన్నా లేవ‌ని, ఇప్పుడు కేవలం రాజ్యం, రాజ్యానికి సంబంధించిన లక్షణాలు మాత్రమే ఉన్నాయ‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ప్ర‌స్తుతం కేసీఆర్‌ మనసులో అన్నీ స్కీములు, పథకాల గురించిన ఆలోచనే త‌ప్ప ఉద్యమం లేద‌ని వెల్ల‌డించారు.

ఇక పార్టీలో, ప్రభుత్వంలో ఉద్యమ స్వభావం తగ్గిపోయింద‌ని, చాలా మంది చాలా రకాలుగా విమర్శలు ఇప్ప‌టికే చేశార‌ని అంటూ ప‌లువురు పేర్ల‌ను ఉద‌హ‌రించారు. నేను ఒక ఉద్యమకారుడిగానే 2004 నుంచి కేసీఆర్‌తో కలిసి ఉన్నా ఇప్పుడు ఇలాంటి పరిణామం చోటుచేసుకుంద‌ని విచారం వ్య‌క్తం చేశారు. కొనుగోలు కేంద్రాలు, రేషను కార్డుల విషయంలో తాను చేసిన కామెంట్లపై పత్రికలు వ‌క్రీక‌రించాయ‌ని, మంత్రి హోదా దాటి మాట్లాడినట్లుగా హడావిడి చేశాయ‌ని, నెగెటివ్ రంగు అద్దాయ‌ని, దీంతో కేసీఆర్‌తో గ్యాప్ ఏర్పడింద‌ని, ఒక‌సారి ఆయ‌న‌తో గ్యాప్ ఏర్ప‌డిన అనంత‌రం అది పూడ్చ‌డం దాదాపు అసాధ్య‌మ‌ని తెల‌ప‌డం గ‌మ‌నార్హం. ఇక ప్ర‌స్తుతం శాఖలేని మంత్రిగానే తాను కొనసాగుతున్నాన‌ని, తాజా పరిణామాలన్నీ త‌న‌ ఆత్మభిమానాన్ని ఇబ్బంది పెట్టాయ‌ని, అభిమానులు, నియోజకవర్గ కార్యకర్తలతో చర్చించిన తర్వాత భవిష్యత్ కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటాన‌ని వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. తాజాగా ఈట‌ల చేసిన వ్యాఖ్య‌లు రాజ‌కీయంగా సంచ‌ల‌నం రేపుతున్నాయి. ఏకంగా కేసీఆర్‌పైనే విమ‌ర్శ‌లు సంధించ‌డం తెలంగాణలో కాక‌రేపుతున్నాయి.