చంద్ర‌బాబు – జ‌గ‌న్‌ను మేనేజ్ చేస్తోన్న ” మెగా “

ఏపీ పాలిటిక్స్‌లో ఇప్పుడు ఆస‌క్తిక‌ర విష‌యాలు చోటు చేసుకున్నాయి. ప్ర‌భుత్వం, దాని విధానాల‌పై విరుచుకుప‌డే జ‌గ‌న్‌.. తాజాగా ఓ విష‌యంలో మాత్రం ఎంతో మౌనాన్ని పాటిస్తున్నారు. అస‌లు ఆ విష‌యం త‌న‌కు తెలీదు అన్న విధంగా ఆయ‌న వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇప్పుడు ఈ విష‌యమే స్టేట్‌లో పెద్ద చ‌ర్చ‌నీయాంశంగా మారింది.

అస‌లు విష‌యంలోకి వెళ్లిపోతే.. ఏపీ చేప‌డుతున్న ప్ర‌తి ప‌థ‌కం, ప్ర‌తి ప‌నిపైనా వైకాపా అధినేత జ‌గ‌న్‌.. అండ్ కో పెద్ద ఎత్తున అవినీతి జ‌రిగిపోయింద‌నే ఆరోప‌ణ‌ల‌తో మైకు గొట్టాల ముందు విరుచుకుప‌డుతున్న విష‌యం తెలిసింది. అమ‌రావ‌తి నిర్మాణం స‌హా, ప‌ట్టిసీమ‌, పోల‌వ‌రం ఇలా దేన్నీ వ‌ద‌ల కుండా బాబుకు కంటిపై నిద్ర లేకుండా చేసేస్తున్నారు.

బాబు హ‌యాంలోని ఏదైనా ప‌థ‌కంపై సాక్షి ప‌త్రిక‌లో వార్త రావ‌డం, దానిని అందిపుచ్చుకుని జ‌గ‌న్ అండ్ కో రెచ్చిపోవ‌డం ఇటీవ‌ల కాలంలో మామూలైంపోయింది. అయితే, తాజాగా పురుషోత్త‌ప‌ట్నం ఎత్తిపోత‌ల ప‌థ‌కానికి సంబంధించి కూడా సాక్షి పెద్ద ఎత్తున అవినీతి క‌థ‌నాల‌ను పేజీల‌కు పేజీలు వండి వార్చింది. అయినా కూడా జ‌గ‌న్ ఈ విష‌యంపై ప‌న్నెత్తు మాట మాట్లాడ‌లేదు. అవినీతి విష‌యం అస‌లు త‌న‌కు తెలీదు అన్న‌ట్టు వ్య‌వ‌హ‌రించాడు కూడా. దీంతో విశ్లేష‌కులు కొంత లోతుగా దృష్టి పెట్ట‌గా అస‌లు విష‌యం వెలుగు చూసింది. ఈ పురుషోత్త‌ప‌ట్నం ద‌క్కించుకున్న మెగా సంస్థ అధినేత‌.. మెగా కృష్ణారెడ్డి.. అటు అధికార ప‌క్షాన్ని ఎలా మేనేజ్ చేశాడో.. ఇటు .. విప‌క్షాన్ని కూడా అలాగే మేనేజ్ చేశాడ‌ట‌.

నిజానికి మెగా కృష్ణారెడ్డి ఏపీలో ప్రాజెక్టులు చేప‌ట్ట‌డం ఇది కొత్త‌కాదు, వైఎస్ జ‌మానాలో పెద్ద ఎత్తున ఆయ‌న కాంట్రాక్టులు చేప‌ట్టారు. అప్ప‌ట్లో ఈ సంస్థ‌పై భారీ స్థాయిలో చంద్ర‌బాబు, ఆయ‌న పార్టీ నేత‌లు అవినీతి ఆరోప‌ణ‌లు చేశారు. అలాంటిది ఏం జ‌రిగిందో తెలీదుకానీ, ఇప్పుడు మాత్రం మెగాకే ప‌నులు అప్ప‌గిస్తున్నారు. ఇక‌, జ‌గ‌న్ కు మెగా కృష్ణారెడ్డికి గ‌తంలోనే అనేక ప‌రిచ‌యాలు ఉన్నాయి.

ఈ నేప‌థ్యంలోనే ఇప్పుడు కూడా మెగా త‌న‌పై ఎలాంటి విమ‌ర్శ‌లూ ఎక్కుపెట్ట‌కుండా జ‌గ‌న్‌ను కూడా మేనేజ్ చేశాడ‌ని చెప్పుకొంటున్నారు. అంటే, మెగా కృష్ణా రెడ్డి అటు అధికార‌, ఇటు విప‌క్ష నేత‌ల‌ను మూకుమ్మడిగా మేనేజ్ చేయ‌డంతో ఇరు ప‌క్షాలూ ఆయ‌న‌కు కీలుబొమ్మ‌లుగా మారాయ‌నే విమ‌ర్శ‌లు వినిపిస్తున్నాయి. ఇక‌, ప‌రిస్థితి ఇలానే కొన‌సాగితే.. ఏపీ ప్ర‌జ‌ల‌ను కాపాడే నాథుడు ఎవ‌రు? అని విశ్లేష‌కులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.