తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్‌తో సినిమా చేసేందుకు పెద్ద పెద్ద దర్శకులు క్యూ కడుతుంటారు! ఆయన డేట్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. కానీ రజనీకాంత్ మాత్రం ఇప్పుడు.. ఒక దర్శకుడితో సినిమా చేయాలని ఉవ్విళ్లూరుతున్నారు. తన డేట్స్ ఇచ్చేందుకు కూడా సిద్ధమవుతున్నారు. ఇంతకీ ఆదర్శకుడెవరనేగా మీ సందేహం.. ఆయనే తెలుగు సినిమా గురించి ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురుచూసేలా చేసిన దర్శకధీరుడు రాజమౌళి! ఇప్పటికే బాహుబలి-2తో దేశవ్యాప్తంగా ప్రభంజనం సృష్టిస్తున్న జక్కన్నతో సినిమా చేయాలని రజనీకాంత్ ఎంతోకాలం నుంచి వెయిట్ చేస్తున్నారట. ఈ తొందరలోనే రాజమౌళిని కొంత ఇబ్బంది పెడుతున్నారట!!
బాహుబలి-2 సినిమాతో రాజమౌళి ఇప్పుడు మోస్ట్ వాంటెడ్ దర్శకుల జాబితాలో చేరిపోయాడు. రాజమౌళితో సినిమా చేయాలని కోరుకుంటున్నవారి జాబితాలో మెగాస్టార్లూ, సూపర్ స్టార్లూ చేరిపోతున్నారు. తాజాగా ఈ జాబితాలో రజనీకాంత్ కూడా చేరిపోయినట్టు తెలుస్తోంది. `ఈగ` సమయంలోనే రాజమౌళి ప్రతిభ చూసి ముగ్థుడైపోయారు రజనీ. బాహుబలి సిరీస్‌లతో ఆ ప్రేమ మరింత పెరిగిందట. బాహుబలి 2 చూసి జక్కన్నను అభినందనలతో ముంచెత్తాడు రజనీకాంత్. ఎవరి పొగడ్తలకూ పడిపోని రాజమౌళి కూడా రజనీ కామెంట్లకు ఆస్కార్ వచ్చినంత సంబర పడుతున్నాడు.
ఇప్పుడు స్వయంగా రజనీకాంతే.. ‘మనం కలసి సినిమా చేయాలి’ అంటూ రాజమౌళిని కోరినట్టు సమాచారం. ఇటీవల కొంతమంది తమిళ నిర్మాతలు రాజమౌళిని సంప్రదించారట. ‘రజనీకి తగిన కథ ఉంటే చెప్పండి’ అని కోరారట. ఇదే సమయంలో రజనీకాంత్ నుంచి ఆఫర్ అనే సరికి రాజమౌళి కూడా బాగా టెంప్ట్ అయ్యాడని తెలుస్తోంది. రజనీకాంత్‌కి తగిన కథలు రాజమౌళి దగ్గర ఆల్రెడీ ఉన్నాయని సమాచారం. విజయేంద్రప్రసాద్ ఓ మాస్ కథని ఎప్పుడో తయారు చేశాడని, అయితే.. అందుకు తగిన సమయం కోసం రాజమౌళి కాచుకొని కూర్చున్నాడని తెలుస్తోంది.
బాహుబలి 2 తరవాత విజువల్ ఎఫెక్ట్స్ ఉన్న సినిమాలకు కొంత గ్యాప్ ఇస్తానని రాజమౌళి ముందే చెప్పాడు. ఈ సారి సింహాద్రి, చత్రపతి రేంజులో హీరోయిజాన్ని ఎలివేట్ చేసే మాస్ కథకి ఓటేస్తాడనడంలో సందేహం లేదు. ఇక మాస్లో రజనీకాంత్ ఫాలోయింగ్ గురించి చెప్పుకోవాల్సిన పనిలేదు. మరి వీరిద్దరూ సినిమా చేస్తే.. ఇక ఆ అంచనాలే వేరుగా ఉంటాయి. అందుకే రాజమౌళి కొంత ఇబ్బంది పడుతున్నాడట. రజనీ సినిమా కోసం కొంత టైమ్ తీసుకోవాలని భావిస్తున్నాడట. రజనీకాంత్ మాత్రం ‘రోబో 2’తరవాత మనం చేస్తున్నాం… అన్నట్టు సంకేతాలు పంపిస్తున్నాడని తెలుస్తోంది.