గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ వేదికపై బాబాయ్ – అబ్బాయి.. డిప్యూటీ సీఎంగా పవన్ ఎంట్రీ..?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్‌చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్‌లో దిల్ రాజు ప్రొడ్యూస‌ర్‌గా వ్యవహరించిన తాజా మూవీ గేమ్ ఛేంజ‌ర్‌. సంక్రాంతి బరిలో జనవరి 10న రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలలో జోరు పెంచారు మేకర్స్. ఇటీవల ఏఎంబీ మాల్‌లో మీడియా సమక్షంలో సినిమా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని జరిపారు. ఇక ఈ ఈవెంట్‌లో రాజమౌళి చేతుల మీదగా ట్రైలర్ లాంచ్ జరిగింది. సినిమా రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న క్రమంలో ఈ నెల 4న రాజమహేంద్రవరంలో ఫ్రీ రిలీజ్ వేడుకలు నిర్వహించనున్నారు. ఇప్పటికే వేడుకకు సంబంధించి అన్ని ఏర్పాట్లు జరిగిపోయినట్లు సమాచారం.

ఈ కార్యక్రమానికి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హాజరవుతారంటూ గత కొద్దిరోజులుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న వార్తలకు అఫీషియల్ ప్రకటన ఇచ్చారు మీకర్స్‌. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇప్పటివరకు ఎలాంటి సినిమా వేడుకల్లో సందడి చేయలేదు. మొదటిసారి డిప్యూటీ సీఎం హోదాల్లో అన్న కొడుకు రామ్ చరణ్ సినిమా ఈవెంట్ కు అతిథిగా హాజరు కాబోతున్నాడు. ఇదే విషయం గురించి నిర్మాణ సంస్థ వెల్లడించింది. రామ్ చరణ్ సినిమా వేడుకకు పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా రాబోతున్న క్రమంలో.. నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ అధికారికంగా ప్రకటిస్తూ పవన్ లుక్‌తో కూడిన పోస్టర్ రిలీజ్ చేశారు.

బాబాయ్ – అబ్బాయ్‌ ఒకే వేదిక పై రానున్నారు. మా నాయకుడు వస్తున్నాడు అంటూ స్పెషల్ పోస్టర్ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ పోస్టర్ వైరల్ గా మారడంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. బాబాయ్, అబ్బాయిలను ఒకే వేదికపై చూడాలంటూ సంబరపడిపోతున్నారు. ఇక ఈ వేడుకను ఏపీలో నిర్వహిస్తుండడం విశేషం. ఇటీవల తెలంగాణ సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన క్రమంలో జరిగిన అలజడి దృష్టిలో పెట్టుకొని ఎలాంటి అపశృతి జరగకూడదనే ఉద్దేశంతో.. ఈ వేడుకను ఏపీలో చాలా పకడ్బందీగా నిర్వహిస్తున్నట్లు సమాచారం.