పుష్ప గురించి షాకింగ్ సీక్రెట్ బ‌య‌ట‌పెట్టిన షారుఖ్‌.. బ‌న్నీ కూడా ఇది ఊహించి ఉండ‌డు!

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కెరీర్ లో తొలి పాన్‌ ఇండియా చిత్రం పుష్ప. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా ఎలాంటి సంచల విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ సినిమాతో అల్లు అర్జున్ నేషనల్ వైడ్‌ గా క్రేజ్ సంపాదించుకున్నాడు. అలాగే ఇటీవల ఈ సినిమాకు గాను ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సొంతం చేసుకున్నాడు. ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాతో బిజీగా ఉన్నాడు. ఇలాంటి తరుణంలో బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ పుష్ప సినిమా గురించి ఓ షాకింగ్ సీక్రెట్ ను బ‌య‌ట‌పెడుతూ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది.

పూర్తి వివరాల్లోకి వెళ్తూ.. షారుఖ్ ఖాన్ నటించిన యాక్షన్ థ్రిల్లర్ `జవాన్` ఇటీవల విడుదలై తొలి ఆట నుంచే హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వ‌సూళ్ల‌తో వీర విహారం చేస్తోంది. సినీ తారలు కూడా ఈ సినిమాని చూసి షారుఖ్ ఖాన్ కు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా అల్లు అర్జున్ కూడా జవాన్ టీమ్ కు విషెస్ తెలిపారు. జ‌వాన్ సినిమాలోని నటీనటులు, టెక్నీషియన్లు, సిబ్బంది, ప్రొడ్యూసర్లకు అభినందనలు. షారుక్ ఖాన్ గారి మాసీయెస్ట్ అవతార్ ఇది. తన స్వాగ్ తో ఇండియాను, ప్రపంచాన్ని ఆకట్టుకుంటున్నారు అంటూ బ‌న్నీ ట్వీట్ చేశారు.

అయితే షారుఖ్ ఖాన్ నుంచి బ‌న్నీకి ఊహించ‌ని రిప్లై వ‌చ్చింది. `స్వాగ్ విష‌యంలో ఫైరే నన్ను మెచ్చుకుంటుంది. వావ్.. చాలా హ్యాపీగా ఉంది. జవాన్ సక్సెస్ రెట్టింపు అయింది. థ్యాంక్యూ. మూడు రోజుల్లో మూడుసార్లు పుష్ప సినిమాను చూసిన నేను మీ నుండి ఏదో నేర్చుకున్నానని ఒప్పుకోక తప్పదు. నా నుంచి నీకో పెద్ద హగ్. టైమ్ దొరికినప్పుడు నేరుగా వచ్చి కౌగిలించుకుంటా. కీప్ స్వాగింగ్. లవ్ యూ` అంటూ షారుఖ్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు వైర‌ల్ గా మారింది. షారుఖ్ ఖాన్ వంటి న‌టుడు పుష్ప సినిమాను మూడు సార్లు చూశాన‌ని చెప్ప‌డ‌మే కాకుండా.. బ‌న్నీ నుంచి కొంత నేర్చుకున్నాని ఓపెన్ గా పంచుకోవ‌డం అంద‌రినీ ఆక‌ట్టుకుంటోంది.