ర‌జ‌నీకాంత్‌కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు.. ఖ‌రీదైన కార్ల‌తో స‌ర్‌ప్రైజ్ చేసిన `జైల‌ర్‌` నిర్మాత‌!

`జైల‌ర్‌` గ్రాండ్ విక్ట‌రీతో సూప‌ర్ స్టార్ ర‌జ‌నీకాంత్ పంట పండింది. నెల్సన్‌ దిలీప్‌ కుమార్‌ దర్శకత్వంలో తెర‌కెక్కిన‌ `జైలర్‌`.. గ‌త నెల‌లో విడుద‌లై బాక్సాఫీస్ వ‌ద్ద విధ్వంసం సృష్టించింది. ఇప్పటికే ఐదు వందల కోట్లు దాటి, ఆరు వందల కోట్ల దిశగా ప‌రుగులు పెడుతోంది. జైల‌ర్ ఘ‌న విజ‌యంతో ఫుల్ ఖుషీలో ఉన్న నిర్మాత కళానిధి మారన్‌.. ర‌జ‌నీకాంత్ కు గిఫ్ట్ ల మీద గిఫ్ట్ లు ఇస్తున్నారు.

జైల‌ర్ సినిమాకు ర‌జ‌నీకాంత్ ఆల్రెడీ రూ. 110 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకోగా.. తాజాగా నిర్మాత మ‌రో 100 కోట్ల రూపాయిల చెక్ ను అంద‌జేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట చ‌క్క‌ర్లు కొట్టాయి. దేశంలోనే హైయెస్ట్ పెయిడ్ హీరోగా ర‌జ‌నీ టాప్ ప్లేస్ లో నిలిచి స‌రికొత్త రికార్డు సృష్టించాడు. అయితే ఇప్పుడు ర‌జ‌నీకాంత్ కు కళానిధి మారన్ మ‌రో స‌ర్‌ప్రైజ్ ఇచ్చారు.

రెండు బీఎండబ్ల్యూ కార్లని రజనీకాంత్‌ ఇంటికి తీసుకొచ్చిన కళానిధి మారన్‌.. అందులో ఏది నచ్చిందో సెలక్ట్ చేసుకోమని ఆఫర్‌ ఇచ్చారు. దీంతో రెండు కార్స్ ను చెక్ చేసిన ర‌జ‌నీకాంత్‌.. ఫైన‌ల్ గా బీఎండబ్ల్యూ ఎక్స్ 7 కారుని సెల‌క్ట్ చేసుకున్నారు. దీంతో బీఎండబ్ల్యూ ఎక్స్ 7 కారు కీస్‌ను ర‌జ‌నీకాంత్ చేతికి అందించారు. ఈ కారు విలువ కోటిన్నర ఉంటుంద‌ని అంటున్నారు. ప్ర‌స్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైర‌ల్ గా మారింది.