జగనే టార్గెట్.. గాజువాకపై నో క్లారిటీ?

జనసేన అధినేత పవన్ కల్యాణ్ వారాహి విజయ యాత్ర మూడో విడత విశాఖలో కొనసాగుతున్న విషయం తెలిసిందే. విశాఖ నగరంలో సభ నిర్వహించిన పవన్..ఆ తర్వాత రిషికొండపై అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని వాటిని పరిశీలించడానికి వెళ్లారు. అలాగే విశాఖ ఎంపీ ఎం‌వి‌వి సత్యనారాయణ అక్రమంగా భూ కబ్జాలు చేసి, రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక తాజాగా ఆయన గాజువాకలో పర్యటించారు.

గాజువాక సెంటర్ లో భారీ సభ నిర్వహించారు. ఇక ఆద్యంతం జగన్‌నే టార్గెట్ చేసుకుని పవన్ విరుచుకుపడ్డారు. రిషికొండ అక్రమాలు, ఎంపీ భూ కబ్జాలు, వాలంటీర్ల డేటా చోరీ, స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణపై మాట్లాడారు. ఇక సీఎం సీటు గురించి కూడా పవన్ స్పందించారు. సీఎం పదవి తీసుకోవడానికి తాను సిద్ధం అని, అయితే అది కావాలనుకుంటే రాదని, కాలమే నిర్ణయిస్తుందని చెప్పుకొచ్చారు. ఇక పూర్తిగా జగన్ పై విమర్శలు చేయడానికే పవన్ సమయం కేటాయించారు.

రాష్ట్రంలో అభివృద్ధి జరగాలంటే జగన్‌ ప్రభుత్వం మారాలని, జగన్‌ ముద్దులు పెడుతూ, తల నిమురుతుంటే అంతా దేవుడనుకున్నారని, కానీ ఆయన దెయ్యమని, ఈ రాష్ట్రాన్ని పీడించుకు తింటున్నాడని,  వ్యవస్థలన్నిటినీ నాశనం చేశాడని, జగన్‌ మళ్లీ సీఎం కాకూడదనేదే తన ప్రధాన ధ్యేయమని చెప్పుకొచ్చారు. ఇలా పవన్ పూర్తిగా జగన్‌నే టార్గెట్ చేశారు.

అయితే గత ఎన్నికల్లో పవన్ గాజువాక నుంచి పోటీ చేసి ఓడిపోయిన విషయం తెలిసిందే. మళ్ళీ అదే సీటులో పోటీ చేస్తానని పవన్ చెప్పలేదు. పోటీపై స్పందించలేదు. దీంతో పవన్ గాజువాకలో పోటీ చేయడం లేదని అర్ధమవుతుంది. ఇక టి‌డి‌పితో పొత్తు ఉంటే..ఈ సీటు జనసేన తీసుకుంటుందా? అనే అంశంపై క్లారిటీ లేదు.