తెలుగు బిగ్‌బాస్-7 కంటెస్టెంట్‌గా బ్యాంకాక్ పిల్ల..?

తెలుగులో ఇప్పటికే బిగ్ బాస్ ఆరు సీజన్లు పూర్తవ్వగా.. త్వరలో ఏడో సీజన్ రాబోతుంది. ఈ సారి కూడా నాగార్జున హెస్ట్‌గా వ్యవహరించనున్నాడు. స్టార్ మాటీవీలో ప్రసారం కానున్న బిగ్ బాస్-7కి సంబంధించిన ప్రొమో ఇటీవల విడుదలైంది. ఈ సారి లోగోను కాస్త మార్చారు. అయితే త్వరలో ప్రారంభం కానున్న బిగ్ బాస్-7కి సంబంధించి కంటెస్టెంట్ల ఎంపిక ఇప్పటికే పూర్తయినట్లు తెలుస్తోంది. గత రెండు సీజన్లలో పెద్దగా ఎవరికీ తెలియని కంటెస్టెంట్లను పెట్టడంతో రేటింగ్స్ కూడా అంతగా రాలేదు.

అయితే ఈ సారి అందరికీ తెలిసిన నటులతో పాటు సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయినవారిని కూడా తీసుకోనున్నారు. అందులో భాగంగా యూట్యూబ్ లో తన వీడియోలతో పాపులర్ అయిన బ్యాంకాక్ పిల్లను కూడా ఈ సారి బిగ్ బాస్-7లోకి తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. విజయనగరానికి చెందిన ఈ యువతి బ్యాంకాక్ పిల్ల పేరుతో యూట్యూబ్ ఛానెల్ ఏర్పాటు చేసి బాగా పాపులర్ అయింది. ఆమె యూట్యూబ్ ఛానెల్ కు 2 మిలియన్ల వరకు సబ్‌స్కైబర్లు ఉన్నారు. బ్యాంకాక్ లో తన భర్త, పిల్లలతో ఉంటూ అక్కడి విశేషాలను, పర్యాటక ప్రదేశాలకు సంబంధించిన వీడియోలు చేస్తూ ఉంటుంది.

సోషల్ మీడియాలో బాగా పాపులర్ అయిన ఈ యవతికి బిగ్ బాస్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో బ్యాంకాక్ లో అద్దెకు ఉండే ఇంటిని ఖాళీ చేసి ఇండియాకు తిరిగి వచ్చేసింది. ఈ మేరకు ఇల్లు ఖాళీ చేస్తున్న వీడియోను కూడా తన యూట్యూబ్ ఛానెల్ లో పోస్ట్ చేసింది. దీంతో బ్యాంకాక్ పిల్లకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని, అందుకే ఇల్లు ఖాళీ చేసి ఇండియాకు తిరిగి వచ్చేస్తుందని కొంతమంది అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమనేది తెలియాలి.