బ్రేకింగ్.. సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు ఇక‌లేరు!

సీనియ‌ర్ న‌టుడు శ‌ర‌త్ బాబు ఇక‌లేరు. 71 ఏళ్ల శ‌ర‌త్ బాబు అనారోగ్య స‌మ‌స్య‌ల‌తో బాధ‌ప‌డుతూ.. తొలుత బెంగుళూరులో చికిత్స తీసుకున్నారు. తర్వాత హైదరాబాద్ లోని ఏఐజి హాస్పిటల్ లో చేరి చికిత్స తీసుకుంటున్నారు. అయితే మెరుగైన వైద్యం అందించిన‌ప్ప‌టికీ మ‌ల్టీ ఆర్గాన్స్ డ్యామేజ్ అవ్వ‌డంతో కొద్ది సేప‌టి క్రిత‌మే ఆయ‌న తుది శ్వాస విడిచారు.

శ‌ర‌త్ బాబు మ‌ర‌ణ వార్త తెలుగు సినీ ప‌రిశ్ర‌మ‌ను విషాదంలోకి నెట్టేసింది. పలువురు సినీ ప్రముఖులు ఆయన మృతి సంతాపం ప్ర‌క‌టిస్తున్నారు. శ‌ర‌త్ బాబు ఆత్మకు శాంతి కలగాలంటూ ప్రార్థిస్తున్నారు. ఆమదాలవలస లో జన్మించిన శ‌ర‌త్ బాబు పోలీస్ ఆఫీసర్ కావాలని కలలు క‌న్నా.. అనుకోకుండా న‌టుడిగా మారాడు. బాలచందర్ దర్శకత్వం వహించిన అవరుగల్ మూవీతో సినీ కెరీర్ ప్రారంభించిన శ‌ర‌త్ బాబు.. 1974లో రామరాజ్యం సినిమాతో హీరోగా శరత్ బాబు తెలుగు ప్రేక్ష‌కుల‌కు పరిచయమయ్యారు.

ఆ తర్వాత తెలుగు, తమిళ, క‌న్న‌డ భాష‌ల్లో రెండు వంద‌ల‌కు పైగా సినిమాల్లో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, విలన్ గా నటించారు. సాగర సంగమం, స్వాతిముత్యం, గుప్పెడు మనసు, అభినందన, నోము, యమకింకరుడు, అమరజీవి వంటి సినిమాలు ఆయనకు గుర్తింపు తెచ్చాయి. ప‌లు సీరియ‌ల్స్ లోనూ న‌టించిన శ‌ర‌త్ బాబు.. చివ‌రిగా `వ‌కీల్ సాబ్‌`లో క‌నిపించారు. ఆ త‌ర్వాత ఆయ‌న మ‌రో సినిమా చేయ‌లేదు. కాగా, శ‌రత్ బాబు పార్థీవ దేహాన్ని చెన్నైకి తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాటు చేస్తున్నారు. చైన్నైలోనే ఆయ‌న అంత్య‌క్రియ‌లు జ‌ర‌గ‌నున్నాయి.