నా వ‌ల్లే `ఆర్ఆర్ఆర్‌`కి ఆస్కార్ వ‌చ్చింది.. అజయ్ దేవ్‌గణ్ షాకింగ్‌ కామెంట్స్!

భార‌త్ కు ఎన్నో ఏళ్ల నుంచి క‌ల‌గా ఉన్న ఆస్కార్ అవార్డు `ఆర్ఆర్ఆర్‌` సినిమాతో సాకారం అయిన సంగ‌తి తెలిసిందే. యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్‌, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ హీరోలుగా ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి రూపొందించిన ఈ చిత్రం ఎన్నో ప్ర‌తిష్టాత్మ‌క అవార్డుల‌ను అందుకుంది. రీసెంట్ గా ఈ సినిమాలోని `నాటు నాటు` పాట బెస్ట్ ఓరిజిన‌ల్ సాంగ్ విభాగంగా ఆస్కార్ అవార్డును కొల్ల‌గొట్టింది.

ఓ తెలుగు చిత్రం ఆస్కార్‌కి నామినేట్‌ కావడం ఇదే తొలిసారి. ఆ పురస్కారం అందుకోవడం కూడా మొదటిసారే. అచ్చమైన భారతీయ సినిమాకి దక్కిన తొలి ఆస్కార్‌‌గా చరిత్ర సృష్టించింది. అయితే `ఆర్ఆర్ఆర్‌`కి ఆస్కార్ అవార్డు నా వ‌ల్లే వ‌చ్చిందంటూ బాలీవుడ్ స్టార్ హీరో అజ‌య్ దేవ‌గ‌ణ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. ఈ చిత్రంలో రామ్ చ‌ర‌ణ్‌కు తండ్రిగా ఆయ‌న కీల‌క పాత్ర పోషించిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న రోల్ ప్రేక్ష‌కుల‌ను ఎంత‌గానో ఆక‌ట్టుకుంది.

అయితే `భోళా` మూవీ ప్ర‌మోష‌న్స్ లో భాగంగా అజ‌య్ దేవ్‌గ‌ణ్ కపిల్ శర్మ షోలో పాల్గొన్నారు. ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటు నాటు సాంగ్ కి ఆస్కార్ వచ్చినందుకు అజయ్ దేవగన్ కి కపిల్ శర్మ కంగ్రాట్స్ చెప్పారు. దీనితో అజయ్ స్పందిస్తూ.. `నా వల్లే నాటు నాటుకి ఆస్కార్ వచ్చింది` అని బదులిచ్చారు. ఈయ‌న మాట్లల‌కు ఆశ్చర్యపోవడం కపిల్ శర్మ వంతైంది. ఎందుకంటే అజయ్ దేవగన్ కి నాటు నాటు సాంగ్ తో ఎలాంటి సంబంధం లేదు. ఈ నేప‌థ్యంలోనే క‌పిల్ శ‌ర్మ అది ఎలా అని ఆసక్తిగా అడగగా.. `ఒకసారి ఊహించుకో నాటు నాటు సాంగ్ కి నేను డ్యాన్స్ చేసుంటే పరిస్థితి ఏంటో` అని అజయ్ బదులిచ్చాడు. దాంతో అంతా పగలబడి నవ్వుకున్నారు.