హీరోయిన్ అనుష్క గురించి కూడా గరికపాటి వారు గరం అయ్యారా?

గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న రచ్చ గురించి అందరికీ తెలిసినదే. ‘అలయ్‌ బలయ్‌’ కార్యక్రమంలో మెగాస్టార్‌ చిరంజీవి, గరికపాటి నరసింహరావు మధ్య చోటు చేసుకున్న సంఘటన రాష్ట్రంలో పెద్ద దుమారమే సృష్టించింది. చిరంజీవిని ఉద్దేశించి గరికపాటి చేసిన వ్యాఖ్యలపై మెగా అభిమానులతో పాటు నెటిజన్స్‌ కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఇక ఈ ఈ వివాదంపై సంచలన దర్శకుడు వర్మ రోజూ ట్వీట్ల వర్షం కురిపిస్తున్నాడు. గరికపాటిని నిందిస్తూ వరుస ట్వీట్స్‌ చేశాడు. ఇక ఆ ట్వీట్ల పర్వం ఆగడంలేదు.

తాజాగా మరొక ట్వీట్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. విషయం ఏమంటే గరికపాటి గతంలో అనుష్క అందం గురించి పొగుడుతున్న వీడియో క్లిప్పుని వర్మ తన ట్విటర్‌ వేదికగా షేర్‌ చేస్తూ “మీరు కూడానా బాహు(గరిక)బలి(పాటి)గారు!” అని దానికి క్యాప్షన్‌ ఇచ్చాడు. దాంతో ఆ వీడియోపై నెటిజన్లు పలురకాలుగా స్పందిస్తున్నారు. ఇకపోతే సదరు వీడియోలో గరికపాటి మాట్లాడుతూ.. “హీరోయిన్లని కుర్రాళ్ళు తెగ చూస్తూ ఉంటారు. ఇందులో ఏముంది అని నేను ఒకసారి ఆలోచించాను. కానీ నా చూపు కూడా ఒక చోట ఆగింది. అది ఎవరంటే మహానటి అనుష్క. ఒక మంచి పోజ్‌ పెట్టి నిలబడి ఉంది. కాసేపు అలాగే చూస్తుండిపోయాను.” అని ఆ వీడియోలో అతను మాట్లాడారు.

కాగా ఆ సదరు వీడియోని వర్మ ఈ సందర్భంగా వ్యంగ్యంగా పోస్ట్ చేసారు. “అంత అందమైన రూపం నన్నే ఆకర్షిస్తుంటే.. వాడిని ఆకర్షించదా? ” అని గరికపాటి తన కొడుకుని ఉద్దేశించి ఆ వీడియోలో చెప్పడం కూడా మనం గమనించవచ్చు. ప్రస్తుతం ఆర్జీవీ చేసిన ఈ ట్వీట్‌ నెట్టింట తెగ చక్కర్లు కొడుతోంది. ఈ తంతు చూస్తుంటే వర్మ గరికపాటివారిని అంత త్వరగా వదిలిపెట్టేటట్టు కనబడటంలేదు.