ఆది నుంచి అదే చంద్ర‌బాబుకు మైన‌స్సా..!

టీడీపీ అధినేత చంద్ర‌బాబు విజ‌న్ ఉన్న నాయ‌కుడిగా పేరు తెచ్చుకున్నారు. అయితే.. అదేస‌మ‌యంలో ఆయ‌న ఎవ‌రినీ న‌మ్మ‌ర‌నే పెద్ద అప‌వాదు ఉంది. ఆయ‌న ఎవ‌రినీ న‌మ్మ‌రు.. క‌నీసం.. త‌న సొంత కుటుం బాన్ని కూడా ఆయ‌న విశ్వ‌సించ‌రు అనే పేరు ఉంది. ఇదే ఇప్పుడుఆయ‌న‌కు మైన‌స్‌గా మారిపోయింది. నిజానికి టీడీపీ నాలుగు ద‌శాబ్దాల‌కు పైగానే చ‌రిత్ర‌ను సొంతం చేసుకున్న పార్టీ. అలాంటి పార్టీలో చంద్ర‌బాబు ఒక్క‌రే రింగ్ మాస్ట‌ర్‌గా క‌నిపిస్తున్నారు.

చంద్ర‌బాబు త‌ర్వాత‌.. ఎవ‌రు? అనే ప్ర‌శ్న వ‌స్తే.. అందరూ గాలిలో చేతులు ఊపే పరిస్థితి నెల‌కొంది. అలాకాకుండా.. చంద్ర‌బాబు కొంద‌రినైనా న‌మ్మాల్సిన అవ‌స‌రం ఉంద‌నేది పార్టీ నేత‌ల మ‌నోగ‌తం. వైసీపీని తీసుకుంటే.. జ‌గ‌న్ ఒక్క‌రే కింగ్‌, విల‌న్ అనేలా పాత్ర పోషిస్తున్నారు. అది నిన్న‌గాక మొన్న పెట్టిన పార్టీ అయిన‌ప్ప‌టికీ.. కొంద‌రు కీల‌క వ్య‌క్తుల‌ను ఆయ‌న కూడా న‌మ్ముతున్నారు. స‌ల‌హాదారులుగా చేర్చుకుని వారికి కూడా ప‌గ్గాలు అప్ప‌గిస్తున్నారు.

కానీ, ద‌శాబ్దాల చ‌రిత్ర ఉన్న చంద్ర‌బాబు.. ఈ ప‌నిచేయ‌లేక పోతున్నారు. దీంతో పార్టీలో ఒక విధమైన అసంతృప్తి అయితే.. పెల్లుబుకుతోంది. దీనిని నివారించాల‌నేది ప్ర‌స్తుతం నాయ‌కులు కోరుతున్న మాట‌. వ‌చ్చే మ‌హానాడులో అయినా.. దీనికి సంబంధించి చంద్ర‌బాబు దృష్టి పెట్టాల‌ని అంటున్నారు. కేవ‌లం చంద్ర‌బాబుతోనే టీడీపీ ఉండ‌దు.. త‌ర్వాత కూడా ఉంటుంది.. అంద‌రూ క‌లిసి పార్టీని సంస్థాగ‌తంగా అభివృద్ది చేసుకోవాల‌నే సంకేతాల ను ఆయ‌న ఇవ్వ‌గ‌ల‌గాలి.

అదేస‌మ‌యంలో కింది నుంచి పైస్థాయి వ‌ర‌కు కూడా చంద్ర‌బాబు అందుబాటులో ఉంటేనే ప‌రిస్థితి మెరుగు ప‌డుతుంద‌నేది మ‌రో సూచ‌న‌. ఈ విష‌యంలోనూ చంద్ర‌బాబు దృష్టి పెట్టాలి. కేవ‌లం కొద్ది మంది నాయ‌కులకే ఆయ‌న అప్పాయింట్‌మెంటు దొరుకుతుంద‌నేది ప్ర‌స్తుతం ఉన్న టాక్ ఇలా.. కొన్ని మైన‌స్‌ల‌ను చంద్ర‌బాబు తొల‌గిస్తే.. ఆయ‌న ఉన్న‌ప్పుడే.. కాదు.. త‌ర్వాత‌. కూడా పార్టీ ప‌దిలంగా ఉంటుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.