హనుమాన్ దీక్షలో ఎన్టీఆర్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇటీవల టాలీవుడ్ బిగ్గెస్ట్ మల్టీస్టారర్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’లో నటించి మెప్పించాడు. ఇక ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించగా, ఇందులో మరో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా నటించాడు. కొమురం భీం పాత్రలో తారక్, అల్లూరి సీతారామరాజు పాత్రలో చరణ్ పవర్‌ఫుల్ పర్ఫార్మె్న్స్‌లు ఇవ్వగా, ప్రేక్షకులు ఈ సినిమాకు బ్రహ్మరథం పట్టారు.

కాగా తన నెక్ట్స్ మూవీని స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కించేందుకు రెడీ అవుతున్న తారక్, ఈ సినిమా కోసం మరోసారి స్లిమ్ లుక్‌లోకి మారుతున్నాడు. అయితే గతకొద్ది రోజులుగా తారక్ మీడియా కంటికి కనిపించడం లేదు. దీంతో తారక్ హనుమాన్ దీక్ష చేపడుతున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా నేడు హనుమాన్ జయంతి సందర్భంగా తారక్ హనుమాన్ దీక్ష తీసుకున్న ఫోటో మీడియాలో కనిపిస్తుంది.

కాషాయం దుస్తుల్లో హనుమాన్ దీక్ష పుచ్చుకున్న తారక్ మనకు ఈ ఫోటోలో కనిపిస్తున్నాడు. కాగా తారక్‌ను ఇలా చూసిన నందమూరి అభిమానులు అచ్చం హరికృష్ణను చూసినట్లు ఉందంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఆర్ఆర్ఆర్ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్న తారక్, ఇప్పుడు ఇలా హనుమాన్ దీక్షలో కనిపించడంతో ఆయన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.