పుష్పక విమానం రివ్యూ అండ్ రేటింగ్

సినిమా: పుష్పక విమానం
నటీనటులు: ఆనంద్ దేవరకొండ, సునీల్, గీత సైని, శాన్వీ మేఘన తదితరులు
సంగీతం: అమిత్ దాసాని, రామ్ మిర్యాల
నిర్మాతలు: గోవర్ధన్ రావు దేవరకొండ, ప్రదీప్ ఎర్రబెల్లి, విజయ్ మట్టపల్లి
దర్శకత్వం: దామోదర్

టాలీవుడ్ రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ సోదరుడు విజయ్ దేవరకొండ హీరోగా తెలుగులో ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆయన చేసిన రెండు సినిమాలు కూడా ప్రేక్షకులను మెప్పించాయి. అయితే బాక్సాఫీస్ వద్ద కమర్షియల్ హిట్లుగా మాత్రం కాలేకపోయాయి. దీంతో ఈసారి ఎలాగైనా కమర్షియల్ సక్సెస్ అందుకోవాలని చూస్తున్న ఆనంద్ దేవరకొండ ఒక ప్యూర్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. ‘పుష్పక విమానం’ అనే కామెడీ ఎంటర్‌టైనర్ మూవీతో ఆనంద్ దేవరకొండ తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకునేందుకు రెడీ అయ్యాడు. ఇక నేడు ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతమేర ఆకట్టుకుందో ఈ రివ్యూలో చూద్దాం.

కథ:
చిట్టిలంక సుందర్(ఆనంద్ దేవరకొండ) ఒక మధ్యతరగతి వ్యక్తి. అతడు మీనాక్షి అనే అమ్మాయిని పెళ్లి చేసుకుని కొత్త కాపురం మొదలుపెట్టాలని ఆశపడతాడు. కానీ పెళ్లయిన మరుసటి రోజే సుందర్ భార్య తన ప్రియుడితో పారిపోతుంది. దీంతో తన భార్య కోసం సుందర్ అన్ని చోట్లా వెతుకుతాడు. అయితే ఈ విషయం అందరికీ తెలిస్తే తన పరువు పోతుందని మరో అమ్మాయిని తన భార్యగా నటించాలని తెచ్చుకుంటాడు. కట్ చేస్తే.. మీనాక్షి హత్యకు గురవ్వడంతో పోలీసు ఆఫీసర్(సునీల్) సుందర్‌ను విచారిస్తాడు. ఈ క్రమంలో సుందర్ ఎలాంటి నిజాలను బయటపెడతాడు? అసలు మీనాక్షి సుందర్ నుండి ఎందుకు దూరం వెళ్లిపోయింది? మీనాక్షిని హత్య చేసింది ఎవరు? అనేది సినిమా కథ.

విశ్లేషణ:
పుష్పక విమానం అనే ఇంట్రెస్టింగ్ టైటిల్‌ను పెట్టుకుని ఆనంద్ దేవరకొండ లాంటి హీరో ఓ సినిమా చేస్తున్నాడంటే, ఈ సినిమాకు టైటిలే సగం బలం అయ్యిందని చెప్పాలి. అయితే ఇలాంటి టైటిల్‌కు ఈ సినిమా ఏమాత్రం న్యాయం చేయలేకపోవడం బాధాకరం. మంచి టైటిల్‌ను పెట్టుకున్నంత మాత్రాన సినిమా హిట్ అవుతుందనే భావనలో ఇంకా మన తెలుగు దర్శకనిర్మాతలు ఉండటం నిజంగా విచారించాల్సిన విషయం. ఇక ఈ సినిమా విషయానికి వస్తే.. ఓ సింపుల్ కథను తీసుకుని దర్శకుడు తెరకెక్కించిన తీరు చాలా రొటీన్‌గా ఉండటం ఈ సినిమాను దెబ్బేసిందని చెప్పాలి. అటు కథనం విషయంలో కూడా ఏమాత్రం ఎంగేజింగ్ కంటెంట్ లేకపోవడం మరో మైనస్.

ఈ సినిమా ఫస్టాఫ్‌లో హీరో పెళ్లి చేసుకుని రావడం, మరుసటి రోజునే అతడి భార్య వేరొక వ్యక్తితో పారిపోవడం లాంటి సీన్స్ ప్రేక్షకులను ఆకట్టుకునే అంశాల కావనే చెప్పాలి. అయితే నేటి సమాజంలో ఇలాంటి సీన్స్ జరుగుతుండటంతో వాటి ఆధారంగా ఈ సీన్ రాసుకుని ఉండొచ్చు. ఇక తన పరువు కోసం మరో అమ్మాయిని తన భార్యగా చూపించి పలు సమస్యల్లో ఇరుక్కుంటాడు హీరో. ఈ క్రమంలో ఓ పోలీస్ ఆఫీసర్ వచ్చి అతడి భార్య మర్డర్‌కు గురయ్యిందని అతడికి ఓ ట్విస్ట్ ఇవ్వడంతో ఇక్కడ ఇంటర్వెల్ బ్యాంగ్ వస్తుంది.

కాగా సెకండాఫ్‌లో హీరోను పోలీస్ స్టేషన్‌లో విచారించే పద్ధతి, అతడు తన భార్య హత్యకు సంబంధించిన సాక్షాలు కలెక్ట్ చేసే వంటి సీన్స్‌తో నింపేశాడు దర్శకుడు. కాగా ప్రీక్లైమాక్స్, క్లైమాక్స్ సీన్స్‌లో ఎలాంటి పస లేకపోవడంతో ప్రేక్షకులు సినిమా పూర్తి కాగానే హమ్మయ్య అంటూ బయటకు రావడం కొసమెరుపు. ఒక సాదాసీదా కథను తీసుకుని రెండున్నర గంటలు ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించాలని చూసిన ‘పుష్పక విమానం’ చిత్ర యూనిట్ చేతులు కాల్చుకుందనే చెప్పాలి. ఓవరాల్‌గా ఇలాంటి సినిమాలు ఓటీటీలో రావడమే గొప్ప అని ఓ సాధారణ ప్రేక్షకుడు భావిస్తాడు.

నటీనటుల పర్ఫార్మెన్స్:
ఆనంద్ దేవరకొండ మూడో సినిమా అయినా కూడా ఇంకా యాక్టింగ్‌లో కాస్త మెచ్యురిటీ తెచ్చుకోవాల్సిన అవసరం ఉంది. అటు డైలాగులు చెప్పడంతో మొదలుకొని, ఎమోషనల్ సీన్స్‌లో కూడా మనోడి హావభావాలు ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. ఇక కామెడీ సీన్స్‌లో బలవంతంగా నవ్వేలా చేస్తాడు ఈ హీరోగారు. కాగా ఈ సినిమాలో ఏదైనా ప్లస్ ఉందంటే అది ఖచ్చితంగా సునీల్ అనే చెప్పాలి. పోలీస్ ఆఫీసర్ పాత్రలో అతడి యాక్టింగ్ బాగుంది. హీరోయిన్లు ఉన్నారంటే ఉన్నారు.. అంతే. ఇక మిగతా నటీనటులు కూడా ఈ సినిమాకు పెద్దగా హెల్ప్ కాలేదు.

టెక్నికల్ డిపార్ట్‌మెంట్:
దర్శకుడు దామోదర్ ఈ సినిమాను తెరకెక్కించిన తీరు పూర్తిగా ఫెయిల్ అయ్యిందని చెప్పాలి. ‘పుష్పక విమానం’ అనే టైటిల్‌తో క్యూరియాసిటీని క్రియేట్ చేసిన ఈ డైరెక్టర్, సినిమా కథతో మాత్రం ఎలాంటి మార్కులు సాధించలేకపోయాడు. కొన్ని సీన్స్‌లో ఆయన టేకింగ్ విధానం ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తుంది. ఇక ఈ సినిమాకు సంగీతం కూడా పెద్దగా చేసిందేమీ లేదు. కేవలం సినిమాటోగ్రఫీ మాత్రమే ఈ సినిమాకు కాస్త వర్కవుట్ అయ్యిందని చెప్పాలి. ఎడిటింగ్ వర్క్, నిర్మాణ విలువలు బాగున్నాయి.

చివరగా:
పుష్పక విమానం – చూసిన ప్రేక్షకుడు అయోమయం!

రేటింగ్:
2.0/5.0