బాస్ మదిలో ఏముందో? ఎమ్మెల్సీ బెర్త్ ఎవరికిస్తాడో?

టీఆర్ఎస్ పార్టీలో నాయకులకు ఎమ్మెల్సీ టెన్షన్ పట్టుకుంది. నామినేషన్ల దాఖలుకు ఈరోజే (మంగళవారం) చివరి రోజు కావడం.. ఇంకా అభ్యర్థులు ఖరారు కాకపోవడంతో ఆశావహుల్లో బీపీ పెరిగిపోతోంది. ఎవరిని ఎంపిక చేయాలి.. ఎంపిక కాని వారికి సమాధానం ఏం చెప్పాలని పార్టీ చీఫ్ కేసీఆర్ నాయకులతో సమాలోచనలు జరుపుతున్నారు. సోమవారం ఉదయం నుంచీ ఇదే విషయంపై కసరత్తు జరుగుతోంది. నామినేషన్ల ఆఖరి రోజు వరకు ఎంపిక చేయకపోవడంతో నాయకులు టెన్షన్ తో అవస్థలు పడుతున్నారు. ఎమ్మెల్యే కోటాలో జరిగే ఈ ఎమ్మెల్సీ ఎన్నికలకు సీనియర్ నాయకులు పోటీపడుతున్నారు. గుత్తా సుఖేందర్ రెడ్డి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, కడియం శ్రీహరి, కౌశిక్ రెడ్డి, ఎర్రోళ్ల శ్రీనివాస్, మదుసూదనాచారి, ఆకుల లలిత పేర్లను పార్టీ అధినేత పరిశీలించినట్లు సమాచారం.

అయితే కాసేపట్లో వీరికి అధికారికంగా సమాచారం ఇచ్చి నామినేషన్లు దాఖలు చేయాలని చెప్పే అవకాశముంది. ఎవరిని ఎంపిక చేయాలి? వారినే ఎందుకు ఎంపిక చేయాలి? ఏ సమీకరణాల ప్రకారం నియమించాలి? కుల సమీకరణలు? గతంలో వారికి ఇచ్చిన హామీలు.. ఇవన్నింటిని బేరీజు వేసుకొని జాగ్రత్తగా అభ్యర్థుల ఎంపిక జరుగుతోంది. ప్రగతి భవన్ లో సీఎం.. కేటీఆర్, హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, వినోద్ కుమార్ తదితరులతో సోమవారం అర్ధారాత్రి వరకు మంతనాలు జరిపారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్యే కోటాలో జరిగే ఎమ్మెల్సీ ఎన్నికలకు మంగళవారంతో గడువు ముగియనుంది. నామినేషన్ల ఉపసంహరణ అనంతరం ఇదేనెల 29వ తేదీన ఎన్నికలు నిర్వహించి అదేరోజు ఓట్ల లెక్కింపు కూడా నిర్వహిస్తారు. మరి మండలిలోకి అడుగుపెట్టేదెవరో, నిరాశకు గురయ్యేదెవరో? కాసేపట్లో తెలిసిపోతుంది.