మధ్యలో దూరితే.. నమ్మేదెవరు?

అమిత్ షా.. రాష్ట్ర భారతీయ జనతా పార్టీ నాయకులకు ఒక దారి చూపించాడు. రాష్ట్రంలో పార్టీ బలం పెంచుకోవడం లక్ష్యం. అందుకోసం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏ పోరాటాలు జరుగుతూ ఉంటే వాటన్నింటిలోనూ తలదూర్చమని ఆయన చెప్పాడు. ప్రజలు దేనికోసం ఉద్యమిస్తున్నా సరే.. వారి వెన్నంటి ఉండమని అన్నాడు. ఆ కోటాలో భాగంగానే.. అమరావతి రాజధాని పోరాటంలో భాగం పంచుకోవాలని అనడం కూడా.

అమరావతి రాజధాని కోసం రైతులు మహాపాదయాత్ర చేపట్టిన నేపథ్యంలో.. ఆ పాదయాత్ర తీవ్రత ఏదో ఒక రూపంలో అమిత్ షా చెవికి సోకినట్టుగా కనిపిస్తోంది. ప్రజలు అంతగా స్పందించి పోరాడుతోంటే.. ఆ పోరాటాన్ని తాము రాజకీయంగా క్యాష్ చేసుకోలేకపోవడం ఏమిటి? అని ఆయన దిగులుపడినట్టుగా ఉన్నారు. అందుకే అమరావతి పోరాటంలో భాగం పంచుకోవాల్సిందిగా పార్టీ వారికి దిశానిర్దేశం చేశారు. కేవలం పాదయాత్రలో పాల్గొనాలని చెప్పడం మాత్రమే కాదు.. అమరావతి ఒకటే రాజధాని అని పార్టీ తీర్మానం చేసిన తర్వాత.. పార్టీ కార్యకలాపాలు మొత్తం దానికి అనుగుణంగానే ఉండాలి కదా.. అంటూ వారికి మరికొంత స్పష్టత ఇచ్చారు.

ఇంతవరకు బాగానే ఉంది. కానీ.. ఇప్పుడు అమిత్ షా పురమాయించాడు గనుక.. హఠాత్తుగా రాష్ట్ర బీజేపీ నాయకులందరూ అమరావతి పోరాటంలోకి, పాదయాత్రలోకి దూకితే రైతులు నమ్ముతారా? అనేది పెద్ద ప్రశ్న. పార్టీ పరంగా అమరావతి రాజధాని అని ఒక తీర్మానం చేయడం మినహా.. అక్కడ రైతులు 700 రోజులుగా సాగిస్తున్న పోరాటానికి పార్టీ ఇచ్చిన మద్దతు శూన్యం. చాలా మొక్కుబడిగా మాత్రమే రాష్ట్ర బీజేపీ నాయకులు అమరావతి రైతుల శిబిరాలకు వెళ్లి, మద్దతు తెలిపారు. పైగా అమరావతి రైతులపై పోలీసులు దాష్టీకాలకు పాల్పడిన ఏ సందర్భంలో కూడా.. బీజేపీ వారికి మద్దతుగా మాట్లాడలేదు. అది తమకు పట్టని వ్యవహారంలాగా మిన్నకుండిపోయింది.

కొన్ని సందర్భాల్లో అమరావతి శిబిరాలకు వెళ్లిన బీజేపీ నాయకులకు చేదు అనుభవాలు కూడా ఎదురయ్యాయి. భారతీయ జనతా పార్టీ తమ ప్రెస్ మీట్లకు కూడా ఆంధ్రజ్యోతి విలేకర్లను నిషేధించేంత ఆగ్రహించడానికి కూడా కారణం అమరావతి పోరాటమే. ఏబీఎన్ చానెల్ డిస్కషన్ లో అమరావతి రైతు, బీజేపీ నాయకుడు విష్ణువర్దన్ రెడ్డి మాటల పట్ల ఆగ్రహించి.. లైవ్ లో చెప్పుతో కొట్టడమే దానికి కారణం. ఇప్పుడు అమిత్ షా.. ఆంధ్రజ్యోతిని ప్రెస్ మీట్లకు పిలవకపోవడాన్ని కూడా తప్పు పట్టారు.

ఇలాంటి నేపథ్యంలో ఇన్నాళ్లూ అమరావతిని అంటీముట్టని పోరాటంలాగా చూసిన రాష్ట్ర బీజేపీ నాయకులు ఇప్పుడు చిత్తశుద్ధితో వారితో కలవగలరా? కలిసినా సరే వారిని ప్రజలు, రైతులు నమ్ముతారా? లేదా.. పోరాటంలో కలిసినట్టుగా బీజేపీ నటిస్తే, వారిని నమ్మినట్టుగా రైతులు నటిస్తూ కాలం గడుపుతారా? అనేది వేచిచూడాలి. ఏ ఎత్తుగడలు వేసినాసరే అమరావతి అనుకూల పోరాటం విషయంలో బీజేపీ విశ్వసనీయత కోల్పోయిందనే మాట నిజం.