జగన్ స్క్రిప్ట్ .. మొత్తం సస్పెన్స్

ఏపీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రాజకీయ పండితులను సైతం ఆశ్చర్యపరుస్తున్నారు.. సీనియర్ రాజకీయవేత్తగా ఆలోచిస్తూ ప్రతిపక్షాలకు కాదు.. సొంత పార్టీ నాయకులకే షాక్ ఇస్తున్నాడు. అనుకున్నది అందరికీ చెప్పడు.. ఇక చెబితే అది జరగి తీరాల్సిందే.. ఇదీ జగన్ స్టైల్. అసెంబ్లీలో ఇటీవల మూడు రాజధానుల బిల్లు విషయంపై మాట్లాడుతూ ఆ ప్రతిపాదనను వెనక్కు తీసుకుంటున్నామని చెప్పారు. ప్రతిపక్ష పార్టీలు ఆనందపడదామనుకునేలోపే మరో బాంబు పేల్చాడు. పకడ్బందీగా బిల్లును మరోసారి ప్రవేశపెడతామని చెప్పడంతో టీడీపీ ఎమ్మెల్యేలు నీరుగారిపోయారు. అరె.. అంతలోనే ఇంత తేడా ఏంటి? అని సీనియర్ ఎమ్మెల్యేలు కూడా షాక్ నుంచి కోలుకోలేకపోయారట. జగన్ అసెంబ్లీలో ఈ సంగతి ప్రకటించకముందే కేబినెట్ సమావేశంలో చర్చించారు. ఆ రోజు ఉదయం ఉన్నట్టుండి కేబినెట్ మీటింగ్ ఏర్పాటు చేశారు. మంత్రులందరూ రావాలని హుకుం జారీ చేశారు. ఆల్ ఆఫ్ సడన్ ఈ మీటింగ్ ఎందుకో అని మంత్రలు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం తప్ప ఎవరికీ విషయం తెలియదు. కొందరైతే చాలా బాధపడ్డారట. ఎందుకటే అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు ఎప్పుడో దాటిపోయింది.. రాజీనామాలు చేయమంటారేమోనని ఒక్కటే టెన్షన్.

తీరా సమావేశానికి వచ్చిన తరువాత త్రీ కేపిటల్స్ సమస్యపై మాట్లాడారట. పాత ప్రతిపాదనను రద్దుచేసి మరింత బలంగా అసెంబ్లీలో పెడదామని సహచరులతో పేర్కొన్నారట. జగన్ ఈ మాటలు అనేసరికి.. కనీసం చర్చ కూడా లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారా అని మనసులో అనుకోవడం తప్ప నోరు తెరచి ఎవరూ ఏమీ అనలేదట. ఎందుకంటే అడిగితే అంతే.. మంత్రి పదవి పోయినా పోవచ్చు. అందరూ శభాష్.. సూపర్ అన్నారని సమాచారం. ఆ తరువాత కేబినెట్ నిర్ణయాలను జగన్ అసెంబ్లీలో ప్రకటించారు. హైకోర్టులో కూడా ఏజీ న్యాయమూర్తులకు చెప్పారు. భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు ఎదురవకుండా పకడ్బందీగా తయారుచేసి ఎవరూ నోరెత్తకుండా చేయాలనేది జగన్ ప్లాన్. ఇంత కొద్ది కాలంలో అంతలా ఎలా ఎదిగిపోయారో అని సొంత పార్టీ నాయకులే కాదు ప్రతిపక్ష పార్టీ నాయకులు కూడా శభాష్ అనకుండా ఉండలేకపోతున్నారట.