వైఎస్సార్ : పంచసూత్రాల పరమోన్నత వ్యక్తిత్వం!

కారణజన్ములు అనే కోవకు చెందిన మహానుభావులు.. ఒక ప్రత్యేక కారణం కోసం పుడతారు. లోకకల్యాణం కోసం నిరంతరం పరిశ్రమిస్తూ ఉండే భగవంతుడు- ప్రతిపనినీ తానొక్కడూ చేయలేక.. కొన్ని నిర్దిష్టమైన పనులు పూర్తి చేయడానికి కొందరిని పుట్టిస్తాడు. వారే కారణజన్ములు. వైఎస్ రాజశేఖర రెడ్డి కూడా అలాంటి మహనీయుడు! ప్రభుత్వాల పరిపాలన అనేది ప్రజాసంక్షేమం అనే లక్ష్యం నుంచి పక్కకు మరలకుండా ఉన్నంతవరకు, ఇతరత్రా సంకుచిత ప్రయోజనాలను లక్ష్యించనంత వరకు ఎవ్వరేమనుకున్నా ఖాతరు చేయకుండా ముందుకు సాగిపోయేలాగా ఉండాలనేది ప్రపంచానికి నిరూపించడమే.. రాజశేఖరరెడ్డి జీవితం ద్వారా భగవంతుడు ఉద్దేశించిన పరమోత్కృష్ట కారణం అని అనుకోవాలి. రెండు దఫాలు ముఖ్యమంత్రి అయి, తన జీవితం ద్వారా భగవంతుడు ఉద్దేశించిన లక్ష్యాన్ని నిరూపించిన తర్వాత.. ఆయన శాశ్వతంగా నిష్క్రమించారు. ఇవాళ ఆయన 12వ వర్ధంతి. ఈ సందర్భంగా తెలుగు జర్నలిస్ట్ డాట్ కామ్ ఆయనకు నివాళి అర్పిస్తోంది.

ఇలాంటి కారణజన్ములు వస్తారు- వారి పాత్ర పూర్తయిన తర్వాత నిష్క్రమిస్తారు! అయితే వారి జీవితపు స్ఫూర్తి ప్రపంచానికి కలకాలం నిలిచేదెలాగ. వారు జీవించిన ప్రపంచంలోనే మనం కూడా జీవిస్తున్నామనే నమ్మకం కలగాలంటే.. వారి జీవితపు మహదాశయాల స్ఫూర్తి మనలో కూడా ఎంతో కొంత ఉండాలి. వారినుంచి మనం అది అందుకోవాలి. అలా జరిగినప్పుడే.. కారణజన్ముల రూపేణా భగవంతుడు ఆశించే లక్ష్యం కంటె.. మరింత ఎక్కువగా ప్రయోజనాన్ని పొంది మనం మనుషులుగా సార్థకమైనట్లు అవుతుంది.

వైఎస్సార్ జీవితం నుంచి ప్రతి మనిషీ నేర్చుకోవాల్సిన అయిదు అంశాలను సూత్రీకరించేందుకు తెలుగు జర్నలిస్ట్ చేస్తున్న ప్రయత్నం ఇది. మన ప్రపంచం పంచభూతాల ఆధారంగా నడుస్తుంది. మన వ్యక్తిగా మన శరీరాన్ని పంచ జ్ఞానేంద్రియాలు నిర్దేశిస్తాయి. మన వ్యవహారాన్ని పంచ కర్మేంద్రియాలు నిర్దేశిస్తుంటాయి. అదేతరహాలో మన వ్యక్తిత్వాన్ని ప్రభావితం చేయడానికి తీర్చిదిద్దడానికి మెరుగుపెట్టడానికి మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి జీవితంనుంచి నేర్చుకోదగిన ఈ అయిదు అంశాలు ఉపయోగపడతాయి. వైఎస్సార్ అంటేనే జననేత. మహా నాయకుడు! నాయకుడు కావాలనుకునే వారు విధిగా తెలుసుకోవాల్సిన అయిదు మంచి లక్షణాలు ఇవి.

1. మనిషిని ప్రేమించు : మనిషి తారసపడినప్పుడు ప్రేమాస్పద చిరునవ్వుతో పలకరించు, పరిచయాలు పెంచుకో. మనుషులే సంపద. ఆర్తిలో, ఆపదలో ఉన్నప్పుడు వర్గాలను గుర్తు చేయకుండా, వైషమ్యాలను తిరగతోడకుండా ఆదుకో.

2. ఆశ్రితులను కాపాడుకో : ఒకరి నమ్మకం సంపాదించడం అనేది చాలా గొప్ప విషయం. మనిషి సాధించగలిగిన అతిపెద్ద ఆస్తి అది. అలా నిన్ను నమ్మి ఎవరైనా నీ వెంట నిలిస్తే అది నీ అదృష్టం. వెంట నిలిచిన వారిని నీ వారుగా ఎంచడానికి, వారు కూడా ఎదగడానికి నీకు చేతనైనంత సహాయం చేయి.

3. బడుగుల్ని విస్మరించొద్దు : ఈ దేశం అసలైన ఆత్మ బతుకులే. వారి వికాసానికి కృషి చేయడం బాధ్యత. ఉత్పాదక వనరుల్ని అందుబాటులో ఉంచి వారి జీవితాలను స్వయం సమృద్ధిగా చేయడం సమసమాజాన్ని కాదు గానీ.. సంతులన సమాజాన్ని నిర్మిస్తుంది.

4. దృఢవిశ్వాసంతో సాగు : చేసే పని మీద ముందు నీకు విశ్వాసం ఉండాలి. నీవు నిర్దేశించుకున్న లక్ష్యంలో, అనుసరిస్తున్న మార్గంలో లోపం లేదనే నమ్మకం నీకున్నప్పుడు.. ఇక విమర్శలతో, మధ్యంతర- నడమంత్రపు సలహాలతో నిమిత్తం లేదు. ముందుకు సాగు.

5. భవిష్యత్తు నీదే : ఆశావహ దృక్పథమే మనిషి జీవితానికి చుక్కాని. నాయకుడికైనా అంతే. మళ్లీ ముఖ్యమంత్రిని కాగలనని ఆశలేని మనిషి, దక్కిన ఒక్క హయాములోనే రాష్ట్రాన్ని తాకట్టు పెట్టేస్తాడు. సాధారణ నాయకుడైనా తాను ఎమ్మెల్యే అవుతాననే ఆశ ఉన్నప్పుడే అక్కడ జనానికి ఏదో ఒక మేలు చేస్తుంటాడు. అందుకే నాయకుడికి భవిష్యత్తు మీద ఆశావహ దృక్పథం, సమాజానికి ఎనలేని మేలు.

ఒక నాయకుడికి ఉండవలసిన పంచసూత్రాలుగా ఇవి స్థిరీకరించాలి. ఈ సూత్రాలను స్థిరీకరిచండానికి వైఎస్సార్ జీవితమే ఒక అధ్యయన గ్రంథం లాంటిది.

మన పురాణాల్లో భీష్ముడు తన కురువంశ వారసులకు ఉద్బోధించిన పాఠాలు ఇవాళ మన బిజినెస్ మేనేజిమెంట్ స్కూళ్లలో కోర్సుల్లో సిలబస్ గా మారుతున్నాయి. అలాగే వైఎస్సార్ జీవితం నుంచి స్థిరీకరించిన ఈ పంచసూత్రాలు కూడా.. కేవలం రాజకీయ నాయకుడికే కాదు. సవ్యంగా అర్థం చేసుకోగలిగితే.. మనందరి వ్యక్తిత్వ నిర్మాణానికి బాటలు వేస్తాయి. సాటి మనిషి ప్రేమకు పాత్రమై, తన జీవితాన్ని మలచుకోవాలని ఆశించే ప్రతి ఒక్కరికీ ఇవి వర్తిస్తాయి.

మహానాయకుడు వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళి.