ఆచార్య ఆలస్యానికి కారణం చెప్పేసిన మెగాస్టార్

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఆచార్య కోసం ప్రేక్షకులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. వేసవిలో రిలీజ్ కావాల్సిన ఈ సినిమా ఇంకా రిలీజ్ కాకపోవడంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు రిలీజ్ చేస్తారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే అసలు ఆచార్య చిత్రం ఎందుకు వాయిదా పడుతుందా అనే ప్రశ్నకు తాజాగా మెగాస్టార్ చిరంజీవి ఓ క్లారిటీ ఇచ్చారు.

ఆచార్య చిత్రం ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా, పలు రకాల కారణాల వల్ల అది కుదర్లేదు. అయితే దసరా కానుకగా ఈ సినిమాను రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించినా, ప్రస్తుతం నెలకొన్న టికెట్ ధరల విషయంపై చిత్ర యూనిట్ వెనకడుగు వేయాల్సి వస్తున్నట్లు చిరు పేర్కొన్నారు. తాజాగా ‘లవ్‌స్టోరి’ చిత్ర ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్యఅతిథిగా వచ్చిన చిరంజీవి ఈ సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులను సినిమా రంగాన్ని ఆదుకోవాల్సిందిగా కోరారు. కేవలం ముగ్గురు, నలుగురు హీరోల కోసం యావత్ సినీ పరిశ్రమను ఇబ్బంది పెట్టడం సమంజసం కాదని, అందుకే సినీ రంగ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని సినిమా రంగాన్ని ఆదుకోవాలని ఆయన ఈ సందర్భంగా కోరారు.

ఏపీలో నెలకొన్న టికెట్ ధరల అంశం ప్రస్తుతం పెద్ద సమస్యగా మారడంతో సినిమా నిర్మాతలు చాలా నష్టపోవాల్సి వస్తుందని ఆయన అన్నారు. వెంటనే ఏపీ ముఖ్యమంత్రి తమ గోడును వినాలని, దీనికి తగిన పరిష్కారాన్ని చూపాలని ఆయన కోరారు. ఏదేమైనా సినిమా రంగంపై ప్రభావం చూపే అంశాలను సినీ జనంతో ప్రస్తావిస్తే బాగుంటుందని ఆయన ఈ సందర్భంగా అన్నారు. ఇక లవ్‌స్టోరి చిత్రం కూడా ఏడాదిన్నరగా రిలీజ్‌ను వాయిదా వేసుకుని, సెప్టెంబర్ 24న ధైర్యంగా ప్రేక్షకుల ముందుకు రానుండటంతో ఈ సినిమా ఘన విజయం సాధించాలని ఆయన కోరుకున్నారు.