వినాయకుడి చేతిలో శానిటరీ ప్యాడ్స్​.. హిందూ సంఘాల మండిపాటు..!

మహిళల నెలసరి విషయంలో మనదేశంలో సరైన అవగాహన ఉండదన్న విషయం తెలిసిందే. బహిష్టు సమయంలో స్త్రీలపై వివక్ష ఉంటుంది. వారిని పవిత్ర కార్యక్రమాలు చేయనివ్వరు. గుడులు, గోపురాలకు వెళ్లనివ్వరు. శుభకార్యాలకు వెళ్లనివ్వరు. ఇటువంటి సంప్రదాయం మనదేశంలో ఉన్నదే. అయితే కేవలం నిరక్షరాస్యులు, గ్రామీణ ప్రాంతాల్లోనే కాక.. పట్టణ ప్రాంతాల్లోనూ ఈ ఆచారాన్ని చాలా మంది చదువుకున్న వాళ్లు పాటిస్తారు. ఈ క్రమంలో నెలసరి సమస్యలపై ఇప్పుడిప్పుడే అవగాహన వస్తుంది. ఈ విషయాన్ని చాలా మంది బహిరంగంగా చర్చిస్తున్నారు. ఇటువంటి సంప్రదాయం మంచిది కాదు అని అవగాహన కల్పిస్తున్నారు.

మధ్యప్రదేశ్​కు చెందిన అంకిత్​ బాగ్ది చాలా ఏళ్లుగా ఈ సమస్యపై పోరాడుతున్నారు. బహిష్టు విషయంపై ఆయన అందరికీ అవగాహన కల్పిస్తున్నారు. ఇందుకోసం ఆయన అనివార్య అనే ఓ స్వచ్ఛంద సంస్థను నెలకొల్పారు. ఇప్పటికే ఈ సంస్థ దాదాపు 20 లక్షల శానిటరీ ప్యాడ్స్​ ఉచితంగా పంపిణీ చేసింది. అయితే ఇటీవల అంకిత్​ బాగ్ది చేసిన ఓ పని తీవ్ర వివాదంగా మారింది.

అంకిత్​ బాతాను నిర్వహిస్తున్న అనివార్య స్వచ్ఛంద సంస్థ కార్యాలయంలో వినాయకుడిని ప్రతిష్ఠించారు. అయితే ఈ వినాయకుడికి పక్కన అతడి భార్యలు సిద్ధి, బుద్ధి కూడా ఉన్నారు. వినాయకుడి చేతిలో ఆయుధాలకు బదులుగా ఆయన శానిటర్​ ప్యాడ్స్​ పెట్టారు. నెలసరి విషయంలో అందరికీ అవగాహన కల్పించేందుకే తాను ఇలా చేశానని ఆయన అంటున్నారు.

అయితే ఈ విషయంపై సంప్రదాయవాదులు, హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. ఇది హిందూ దేవుళ్లను అవమానించడమే అని వారు అంటున్నారు. సోషల్ మీడియాలో సైతం ఈ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మొత్తానికి ఈ వివాదం ఎక్కడికి చేరుకుంటుందో వేచి చూడాలి.