తలైవి చాలా బాగుంది.. తలైవా ప్రశంసలు..!

దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన మూవీ తలైవి. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ టైటిల్ రోల్ పోషించింది. ఈ సినిమాకు ఏ
ఎల్ విజయ్ దర్శకత్వం వహించాడు. వినాయక చవితి సందర్భంగా ఈ నెల 10వ తేదీన ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీకి విమర్శకుల నుంచి ప్రశంసలు వస్తున్నాయి.

జయలలితగా కంగనా రనౌత్, ఎంజీఆర్ గా అరవింద్ స్వామి అద్భుతంగా నటించారంటూ అభినందిస్తున్నారు. తాజాగా ఈ సినిమాపై తమిళ సూపర్ స్టార్ రజినీకాంత్ స్పందించారు. తలైవి సినిమా చూశానని, తనకు బాగా నచ్చిందని, దర్శకుడు ఏఎల్ విజయ్ సినిమాను అద్భుతంగా చిత్రీకరించారని చిత్ర యూనిట్ కు అభినందనలు తెలిపారు.

ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ నుంచి ప్రశంసలు రావడంతో తలైవి మూవీ యూనిట్ ఉబ్బితబ్బి అవుతోంది. సినిమా బాగుందని అంతటా పాజిటివ్ టాక్ వస్తుండగా తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ అన్నాడీఎంకే మాత్రం తలైవి సినిమాపై విమర్శలు చేస్తోంది. ఎంజీఆర్ కు సంబంధించి చరిత్ర వక్రీకరించి తలైవి సినిమా తీశారని.. ఈ సినిమాను అధికారంలో ఉన్న డీఎంకేకు అనుకూలంగా తీశారని మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళని స్వామి విమర్శలు చేశారు.