దేశ రాజకీయాల్లోకి కేసీఆర్ మరో అడుగు!

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టేందుకు ఈసారి తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. గతంలో ఫెడరల్ ఫ్రంట్ అంటూ పలు రాష్ట్రాలకు చక్కర్లు కొట్టిన కారు పార్టీ అధినేత ఈసారి ఢిల్లీలో పార్టీ కార్యాలయానికి శంకుస్థాపన చేయనున్నారు. సెప్టెంబర్ 2న జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఢిల్లీ ప్రయాణానికి పార్టీ ఏర్పాట్లు కూడా చేస్తోంది. పెద్ద పెద్ద నాయకులకు విమాన ప్రయాణాలు అరేంజ్ చేస్తోంది. ఇవన్నీ చూస్తుంటే కేసీఆర్ తనకున్న పట్టును ఢిల్లీలో చూపించాలనుకుంటున్నట్లు తెలుస్తోంది అని పరిశీలకులు భావిస్తున్నారు. పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, లోక్ సభ, రాజ్యసభ సభ్యులు తప్పనిసరిగా హాజరు కావాలని ఇప్పటికే ఆదేశాలందాయట.

ఇవన్నీ చూస్తుంటే పార్టీని ఢిల్లీ స్థాయిలో పాపులర్ చేయాలని గులాబీ బాస్ నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. లేకపోతే ఇంత హంగామా ఎందుకు అని ప్రశ్నిస్తున్నారు పరిశీలకులు. ఇన్ని రోజులు పార్టీ గురించి పెద్దగా పట్టించుకోని అధినేత ఇప్పుడు పార్టీపై ద్రుష్టి సారించారు. ముఖ్యంగా బూత్ స్థాయి నుంచి పటిష్టం చేయడంతోపాటు కమిటీలను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అన్ని స్థాయిల్లో కేడరును బలోపేతం చేసి వచ్చే ఎన్నికల్లో మరోసారి విజయం సాధించాలనేది ఆయన లక్ష్యం. ఆ తరువాత ఇక్కడ పాలిటిక్స్ ను కుమారుడికి అప్పగించి ఢిల్లీలో అడుగుపెట్టి దేశ రాజకీయాల్లో టీఆర్ఎస్ సత్తా చూపాలనేది ఆయన ఆశయమని తెలిసింది. సెప్టెంబరు 2న ఢిల్లీలో జరిగే పార్టీ భవన శంకుస్థాపన కార్యక్రమం తరువాత ఈ జోరు ఊపందుకుంటుంది.