వామ్మో..! ఇంతమంది సలహాలిస్తున్నారా.. ఇదేంది సామీ..!

ఒక్కరు.. ఇద్దరు కాదు.. ఏకంగా 41 మంది సలహాలిస్తున్నారా? ఏం సలహాలిస్తున్నారు? ఎన్ని సలహాలిస్తున్నారు? అదీ లక్షల రూపాయలు తీసుకుంటూ.. అని జనం మందిలో ఇపుడు లక్ష ప్రశ్నలు మెదులుతున్నాయి. ఏపీ రాష్ట్ర ప్రభుత్వానికి 41 మంది నిపుణులు సలహాలిస్తున్నారని.. వారంతా ప్రభుత్వ సలహాదారులని కోర్టుకు చెప్పడంతో కోర్టు కూడా ఆశ్చర్యపోయింది. వీరికి కల్పిస్తున్న సౌకర్యాలు న్యాయమూర్తులకు కూడా లేవే అని అడగడం.. ఇది పేపర్లలో రావడంతో జనం మదిలో ఆలోచనలు మొదలయ్యాయి.

 

తనకు, తన పార్టీకి సాయం చేసిన వారికి, కష్టకాలంలో ఉన్నపుడు అండగా ఉన్న వారికి జగన్ ఏదైనా చేయాలనకున్నాడు. అనుకున్నది చేసేయడమే జగన్ పని. తరువాత 2019 ఎన్నికల్లో విజయం సాధించి అధికారం చేపట్టిన తరువాత సీఎం వైఎస్ జగన్ వారిని మరచిపోలేదు. వారు చేసిన సాయానికి రుణం తీసుకోవాలనుకున్నాడు.. అందుకే ప్రభుత్వ సలహాదారులుగా కావలసిన వారిని కావలసినంత మందిని నియమించారు. ఇపుడు అదే ఆయనకు తలనొప్పిగా మారింది. వారు సలహాలివ్వకుండా రాజకీయాలు చేస్తున్నారు.. నేరుగా మీడియా సమావేశాల్లో రాజకీయాలు మాట్లాడుతున్నారు.. ఇదేం పద్ధతి అని గిట్టని వారు కోర్టుకు వెళితే సలహాల్రావుల సంగతి తెలిసింది ప్రపంచానికి. మరి కోర్టుకు ఏం సమాధానం చెబుతారో ఈ సలహాదారులు.