కల్వకుంట్ల కవిత ఎందుకో రాజకీయాలకు దూరం?

కల్వకుంట్ల కవిత.. తెలంగాణలో హై ప్రొఫైల్ ఉన్న నాయకురాలు.. పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ కూతురు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ బ్రహ్మరథం పట్టే కార్యకర్తలు.. సీఎంకు కూడా ముద్దుబిడ్డ.. అటువంటి కవిత ఎందుకో కొద్ది నెలలుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అభినందనలు, పరామర్శలు మాత్రమే చేస్తున్నారు. ఒకటి, రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతే.. ట్వీట్లకు రీ ట్వీట్ చేయడం మాత్రమే చేస్తున్నారు. ట్విట్టర్ లో తప్ప న్యూస్ పేపర్, టీవీలలో ఎక్కువగా కనిపించడం లేదు.

తాను ప్రాతినిధ్యం వహిస్తున్న నిజామాబాద్ లో కూడా పర్యటనలు చేస్తున్నారా అంటే.. తక్కువ అనే చెప్పవచ్చు. 41 రోజుల పాటు చిన్న హనుమాన్ జయంతి నుంచి పెద్ద హనుమాన్ జయంతి వరకు (మార్చి, ఏప్రిల్) హనుమాన్ చాలీసా పారాయణం చేస్తున్నట్లు ఫిబ్రవరిలో ప్రకటించారు. ఎమ్మెల్సీగా విజయం సాధించిన తరువాత ఆమె పొలిటికల్ గ్రాఫ్ పెంచేలా కేసీఆర్ ప్లాన్ చేశారని, కేబినెట్లోకి వస్తారని పార్టీ కేడర్ భావించింది. అయితే ఎందుకో అది జరగలేదు. ఇదిలా ఉండగా వచ్చే ఎన్నికల్లో కవిత ఎమ్మెల్యేగా పోటీచేస్తారని, పార్టీ చీఫ్ కూడా అందుకు సుముఖంగా ఉన్నారని.. అన్నీ అనుకూలిస్తే అప్పుడు కేబినెట్లోకి వచ్చే ఛాన్స్ ఉందని పరిశీలకులు భావిస్తున్నారు. అందుకే ఇప్పటినుంచే గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నట్లు సమాచారం.