మోత్కుపల్లి బీజేపీని వీడేందుకు కారణం దొరికింది

తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం పనిచేసి.. అక్కడ ఇమడలేక బీజేపీ గూటికి చేరిన సీనియర్ నాయకుడు మోత్కుపల్లి నర్సింహులు ఇపుడు పార్టీని వీడుతున్నారు. తాను బీజేపీకి రాజీనామా చేస్తున్నానంటూ మీడియా సమావేశంలో ప్రకటించారు. ఇన్ని రోజులు బీజేపీలో తగిన గుర్తింపు లేక సతమతమవుతున్న మోత్కుపల్లి పార్టీకి గుడ్ బై చెప్పాలని అనుకుంటూ ఉన్నారని, అయితే సరైన కారణం చూపకుండా బయటకు వస్తే విమర్శలు వస్తాయని ఇన్నాళ్లూ వెయిట్ చేశారని తెలిసింది.

ఇపుడు ఈటల రాజేందర్ బీజేపీలో చేరారని, భూ కబ్జాలు చేసిన వ్యక్తిని పార్టీలోకి ఎలా తీసుకుంటారని ప్రశ్నిస్తున్నారు. అంతేకాక ఇంత సీనియర్ నాయకుడినైన తనకు కమలాధిపతులు కనీసం ఒక్క పోస్టు కూడా ఇవ్వలేదని.. జాతీయ సభ్యుడిగా కూడా నియమించలేదని ఆయన ఆవేదన అని తెలుస్తోంది. ఓ వైపు ఇది ఇలా ఉంటే.. మరోవైపు తాను కేసీఆర్ కు మద్దతు పలుకుతున్నానని చెప్పడం కొసమెరుపు. గులాబీ బాస్ ప్రకటించిన దళిత బంధు పథకం తనను ఆకట్టుకుంది.. ఈ పథకంతో దళితుల జీవితాల్లో వెలుగులు వస్తాయని, ఆ స్కీమ్ కు మద్దతు పలుకుతానని మోత్కుపల్లి చెప్పారు. అంటే ఈయన కారెక్కేందుకు రెడీ అయ్యారని.. తెలంగాణ భవన్ కూడా ఇందుకు సుముఖంగానే ఉన్నట్లు తెలిసింది.