ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ తీపిక‌బురు..!

త‌న ఖాతాదారుల‌కు ఎస్‌బీఐ తీపిక‌బురును అందించింది. కేవైసీ, ఇతర పనుల కోసం ఎవ‌రూ కూడా బ్యాంకుకు రావాల్సిన అవ‌స‌రం లేద‌ని స్ప‌ష్టం చేసింది. అందుకు సంబంధించిన గ‌డువును పొడ‌గించింది. ఇదిలా ఉండ‌గా.. ఎస్‌బీఐలో ప‌లు బ్యాంకుల విలీనమైన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలోనే ఖాతాదారులంద‌రూ త‌మ కేవైసీని స‌మ‌ర్పించాల‌ని సూచించింది. అందుకు మే 31వ తేదీ చివ‌రి గ‌డువుగా స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ప్రకటించింది. అక్క‌డితో ఆగ‌కుండా ఆ తేదీలోగా కేవైసీ సమర్పించకపోతే ఖాతాలను నిలిపివేస్తామనే హెచ్చ‌రించింది. దీంతో ఖాతాదారులు తీవ్ర ఆందోల‌న‌కు గుర‌వుతున్నారు. అందుకు కార‌ణం లేక‌పోలేదు.

ఒక‌వైపు క‌రోనా సెకండ్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. వైర‌స్ సుడిగాలిలా చుట్టుముడుతూ ప్రాణాల‌ను బ‌లిగొంటున్న‌ది. తెలంగాణ వ్యాప్తంగా మొత్తంగా ఎస్‌బీఐకి చెందిన సుమారు 600 మంది బ్యాంకు సిబ్బందే వైర‌స్ బారిన ప‌డ్డారంటే ప‌రిస్థితి ఎంత బీతావాహ‌నంగా ఉన్న‌దో అర్థం చేసుకోవ‌చ్చు. ఈ నేప‌థ్యంలోనే బ్యాంకు అధికారులు రోస్ట‌ర్ విధానంలో విధుల‌ను నిర్వ‌హిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా గ‌తంలో కేవైసీపై చేసిన ప్ర‌క‌ట‌న‌ను ఎస్బీఐఉపసంహరించుకుంది. కేవైసీలను సమర్పించడానికి బ్రాంచ్‌లకు రావొద్దని సూచించ‌డ‌మే గాకుండా బ్రాంచ్‌లకు రాకుండానే కేవైసీని ఎలా స‌మ‌ర్పించాలో తెలియజేసింది. అంతేకాదు కేవైసీ కోసం ఖాతాదారుల‌పై ఒత్తిడి చేయ‌వ‌ద్ద‌ని కూడా అన్నిశాఖ‌ల‌ను ఆదేశించింది. ఇక ఖాతాదారులు తమ కేవైసీ వివరాల‌ను పోస్టు లేదా రిజిస్టర్డ్‌ ఈమెయిల్‌ ఐడీ ద్వారా పంపవచ్చని సూచించింది. కొంత కాలం కిందట ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ చేసిన ట్వీట్‌ తర్వాత ఎస్‌బీఐ ఈ చర్య తీసుకోవ‌డం గ‌మ‌నార్హం.