ఈట‌ల‌కు బీజేపీ అమిత్‌షా ఫోన్‌..?

టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహానికి గురైన‌ మంత్రి ఈటల రాజేందర్‌తో బీజేపీ నేతలు అప్పుడే సంప్రదింపుల‌కు తెర‌లేపారు. శ‌నివారం ఉదయం నుంచి రాత్రి వరకు షామిర్‌పేట్‌లోని త‌న ఫామ్ హౌస్‌కే ప‌రిమిత‌మైన ఈట‌ల అక్క‌డ త‌న నియోజకవర్గ అభిమానులతో స‌మావేశ‌మ‌య్యారు. ఇదిలా ఉండ‌గా రాత్రి పొద్దుపోయిన తర్వాత బీజేపీ కేంద్ర అధిష్టానం పెద్దలు ఈటల రాజేందర్‌తో టెలిఫోన్‌లో మాట్లాడినట్లు వార్తలు వచ్చాయి. బీజేపీ పార్టీ సీనియర్ నేత అమిత్ షానే స్వయంగా ఫోన్ చేసి మాట్లాడినట్లు స‌మాచారం. కానీ ఇటు ఈటల వర్గీయులు, అటు బీజేపీ రాష్ట్ర నేతలు మాత్రం ఇందులో వాస్తవం లేదని కొట్టిపారేశారు. ఇదిలా ఉండ‌గా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కూడా శనివారం షామీర్‌పేట్ వెళ్ళాలనుకున్నప్పటికీ రద్దీ దృష్ట్యా వెళ్ళకుండా టెలిఫోన్‌లోనే ఈటలకు సానుభూతి తెలియజేసినట్లు వార్తలు వచ్చినా దీనిని బండి సంజయ్ ధృవీకరించలేదు. ఈటలకు టీఆర్ఎస్‌లో అన్యాయం జరిగిందని మీడియా ద్వారా వ్యాఖ్యలు చేసిన బండి సంజయ్ షామీర్‌పేట్‌కు వెళ్ళి ఈటలను కలిసే అవకాశం ఉందని బీజేపీ శ్రేణులే సూచనప్రాయంగా తెలిపినా చివరి నిమిషంలో ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నట్లు తెలుస్తున్న‌ది.

ఇక మంత్రి ఈటల రాజేందర్ భవిష్యత్ కార్యాచరణపై రాజ‌కీయ‌వ‌ర్గాల్లో ఆసక్తికరమైన చర్చ కొన‌సాగుతున్న‌ది. హుజురాబాద్ నాయకులతో పాటు ఇతర ప్రాంతాలకు చెందిన నాయకులు భారీగానే షామిర్‌పేట‌లోని ఈట‌ల ఫామ్ హౌస్‌కు శ‌నివారం ఉద‌యం నుంచే బారులు తీరారు. మంత్రికి సానుభూతి తెలిపారు. ఈ సంద‌ర్భంగా కొంద‌రు నేత‌లు అధినేత కేసీఆర్‌తో విబేధించిన చాలా మంది రాజకీయాల్లో సక్సెక్ కాలేకపోయారని, దానిని దృష్టిలో పెట్టుకుని సామరస్యంగా వ్యవహారాన్ని సెటిల్ చేసుకుంటే బావుంటుందన్న అభిప్రాయాన్ని ఈటల ముందు వ్యక్త పర‌చార‌ని తెలుస్తున్న‌ది. మరికొందరు మాత్రం పొమ్మన లేక పొగపెడుతున్న టీఆర్ఎస్‌లో కొనసాగడం సరికాదని, అపాయింట్‌మెంట్ కూడా ఇవ్వలేదంటే పార్టీలో సీనియరైన ఈటలను అవమానించినట్టేనని, ఇక‌ గులాబీ జెండాను వదిలేసి ప్రత్యక్ష్య పోరాటానికి దిగి సత్తా ఏంటో చూపించాల్సిన సమయం ఆసన్నమైందని, అందుకు వెన్నుదన్నుగా నిలుస్తామని చెప్పిన‌ట్లు సమాచారం. అయితే ఈటల తనమనసులోని మాట బయటపెట్టకపోయినప్పటికీ అందరి అభిప్రాయాలను మాత్రం తెలుసుకుంటున్నార‌ట‌. ఇదిలా ఉండ‌గా శామీర్‌పేట్‌లోని ఈటల నివాసంలో ఏం జరుగుతోందో తెలుసుకునేందుకు ఓ వైపున ఇంటలీజెన్స్ మరో వైపున పార్టీ నాయకులు ఎప్పటికప్పడు ఆరా తీస్తుండ‌డంతో పాటు సెకండ్ క్యాడర్‌తో టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఫోన్లలో మాట్లాడుతూ ఎవరెవరు వచ్చారు, ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే పనిలో నిమ‌గ్న‌మ‌య్యార‌ట‌. మ‌రి ఈట‌ల ఎప్పుడు ఎలాంటి బాంబు పేల్చుతారో చూడాలి.