అనంత‌పురంలో తీవ్ర విషాదం.. ఆక్సిజ‌న్ అంద‌క‌..

కొవిడ్ సెకండ్ వేవ్ విల‌య‌తాండ‌వం చేస్తున్న‌ది. ఊపిరాడ‌నివ్వ‌డం లేదు. రెండో ద‌ఫాలో చాలా మంది శ్వాస‌కోశ సంబంధిత ఇబ్బందుల‌తో, ముఖ్యంగా ఆక్సిజ‌న్ అంద‌క‌నే ప్రాణాల‌ను కోల్పోతుండ‌డం విచార‌క‌రం. ఇప్ప‌టికే ఢిల్లీ, మ‌హారాష్ట్ర‌, ఒడిశా, ఉత్త‌ర‌ప్ర‌దేశ్ త‌దిత‌ర రాష్ట్రాల్లో ప‌దుల సంఖ్య‌లో కొవిడ్ బాధితులు ప్రాణాల‌ను కోల్పోయారు. ఇప్ప‌టికే అనేక వైద్య‌శాల‌ల్లో ఆక్సిజ‌న్ కొర‌త నెల‌కొన్న‌ది. కేంద్రం సైతం ఆగ‌మేఘాల మీద ఆయా రాష్ట్రాల‌కు ఆక్సిజ‌న్‌ను స‌ర‌ఫ‌రా చేస్తున్న‌ది. అయిన‌ప్ప‌టికీ స‌కాలంలో ఆక్సిజ‌న్ అంద‌క రోగులు విగ‌త‌జీవులుగా మారుతున్నారు.

తాజాగా ఏపీలో కరోనా మహమ్మారి ఉధృతి ఇంకా కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో ఆక్సిజన్ అందుబాటులో లేక ఆస్పత్రుల్లో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి కొన‌సాగుతుండ‌డం శోచ‌నీయం. తాజాగా అనంతపురం జిల్లా జనరల్ హాస్పిటల్లో ఆక్సిజన్ అందక 10 మంది రోగులు ప్రాణాలు కోల్పోయారు. ప్రాణవాయువు అందక కళ్ల ముందే తమ వారు చనిపోతుండడంతో బాధిత కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. విషయం తెలియడంతో హాస్పిటల్లో తనిఖీ చేసి జాయింట్ కలెక్టర్ నిశాంత్ కుమార్ వైద్యులను విచారించారు. వైద్య‌సిబ్బంది నిర్లక్ష్యం వల్లే తమ వారు మరణించారని మృతుల బంధువులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.