బిర్యానీ ఇవ్వ‌లేద‌ని.. హోట‌ల్కే నిప్పు..!

హోట‌ల్‌కు వెళ్ల‌డం. డ‌బ్బులు కాదంటే ఉచితంగా వ‌స్తువుల‌ను డిమాండ్ చేయ‌డం. కాదంటే ఘ‌ర్ష‌ణ‌కు దిగ‌డం, లేదంటే హోట‌ల్‌ను ధ్వంసం చేయ‌డం. ఇదీ మ‌న తెలుగు సినిమాల్లోని స‌న్నివేశం ఏమాత్రం కాదు. నిజంగానే జ‌రిగింది. త‌మ‌కు ఉచితంగా బిర్యాని ఇవ్వ‌లేద‌ని ఓ రౌడీ గ్యాంగ్ ఏకంగా స‌ద‌రు హోట‌ల్‌కే నిప్పు పెట్టింది. ఈ సంఘ‌ట‌న త‌మిళ‌నాడులో వెలుగుచూసింది. అధికారులు, బాధితులు తెలిపిన క‌థ‌నం ప్ర‌కారం..

త‌మిళ‌నాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా తిరుమళిసైలో అరుణాచలపాండ్యన్, మహారాజన్, గణేశన్‌ అనే ముగ్గురు వ్యక్తులు క‌లిసి స్థానికంగా కస్తూరీ భవన్ పేరిట‌ హోటల్‌ నిర్వహిస్తున్నారు. ఇదిలా ఉండ‌గా సోమవారం మధ్యాహ్నం కొందరు గుర్తుతెలియని వ్యక్తులు హోటల్‌కు వచ్చారు. తాము రౌడీషీటర్‌ ఎబిన్ మ‌నుషుల‌మ‌ని, ఉచితంగా బిర్యానీ ఇవ్వాలని బెదిరించారు. అయితే అప్ప‌టికే బిర్యానీ అయిపోయిందని నిర్వాహకులు చెప్పడంతో వారు ఆగ్రహించారు. ఎబిన్‌ అడిగితేనే బిర్యానీ లేదంటారా..? మీ సంగతి తేలుస్తాం అంటూ వెళ్లిపోయారు. కొద్దిసేప‌టి తర్వాత నాలుగు బైక్‌లపై ఎనిమిది మంది తిరిగివ‌చ్చారు. హోటల్‌పై పెట్రోల్‌ బాంబు విసిరారు. దీంతో హోట‌ల్ అగ్నికి ఆహుత‌య్యింది. దీంతో హోటల్‌ నిర్వాహకులు పోలీసుల‌ను ఆశ్ర‌యించ‌గా, వారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుల కోసం గాలింపు మొదలుపెట్టారు అధికారులు.