తెలంగాణలో వైఎస్సార్సీపీ: గుడ్‌ జోక్‌

తెలంగాణలో తెలుగుదేశం పార్టీకే దిక్కు లేదు. వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ తెలంగాణ రాజకీయాల్లో ముఖ్యభూమిక పోషిస్తుందని ఎవరైనా అనాల్సి వస్తే అది పెద్ద జోకే అవుతుంది. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్‌ పార్టీ కూడా తెలంగాణలో మనుగడ సాధించలేని పరిస్థితి ఏర్పడింది. కేంద్రంలో అధికారంలో ఉండటంతో బిజెపి కాస్త బతికిపోయిందంతే. వామపక్షాలకు కూడా చోటు లేకుండా పోయింది తెలంగాణలో.

ప్రత్యేక రాజకీయ పరిస్థితులు తెలంగాణలో ఉన్నాయి. వాటిని ఇంకా కాంప్లికేటెడ్‌గా మార్చేశారు టిఆర్‌ఎస్‌ అద్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్‌. రాజకీయ ప్రత్యర్థి అన్న ప్రస్తావనే రాకుండా ప్రత్యర్థుల్ని ‘క్లీన్‌’ చేసుకుంటూ పోతున్నారాయన. తెలంగాణలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ 2014 ఎన్నికల్లో ఓ ఎంపీ, ముగ్గురు ఎమ్మెల్యేలను గెలిపించుకుంది. అందరూ ఖమ్మం జిల్లాకు చెందినవారే. కానీ వారెవరూ ఇప్పుడు వైఎస్‌ఆర్‌సిపిలో లేరు. అందరూ టిఆర్‌ఎస్‌లో విలీనమైపోయారు. ముఖ్య నేతలనదగ్గరవారెవరూ తెలంగాణలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీకి లేరు. గ్రేటర్‌ హైదరాబాద్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికే మొహం చెల్లలేదు వైఎస్‌ జగన్‌కి.

పార్టీ ఉనికిని చాటుకోడానికైనా ఎన్నికల్లో పోటీ చేస్తూ ఉంటే క్యాడర్‌ కొనసాగడానికి ఆస్కారముంటుంది. షర్మిలకు తెలంగాణ బాధ్యతలు గతంలో జగన్‌ అప్పగించినా, ఆమె అంత యాక్టివ్‌గా లేరు తెలంగాణలో. ఆంధ్రప్రదేశ్‌లో కూడా వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ రాజకీయంగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటోంది. గడచిన కొంత కాలంగా తెలంగాణలో వైఎస్‌ఆర్‌ కాంగ్రెసు పార్టీ ఏ కార్యక్రమం కూడా చేపట్టలేకపోయింది. అలాంటప్పుడు తెలంగాణలో వైఎస్‌ఆర్‌సిపి ఉందని ఎలా అనుకోగలం?